ఆమెకు వందేళ్లు.. పాదాభిషేకం చేసి అపూర్వ స్వాగతం పలికిన కొడుకు.. భావోద్వేగాలకు లోనైన కుబుంబసభ్యులు.. ఎందుకంటే..

స్వాగతం పలుకుతూ ఫ్లెక్ష్ ఏర్పాటు చేస్తున్న గ్రామస్తులు

Telangana News: ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం. అది దారా విష్ణుమోహనరావు నివాసం. అప్పుడే ఓ అంబులెన్స్‌ వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి ఓ పండు వృద్ధురాలు ఒకరి భుజంపై చేయి వేసి నెమ్మదిగా కిందకు దిగింది. అంతే ఒక్కసారిగా మేళతాళాలు, మంగళవాద్యాలు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం. అది దారా విష్ణుమోహనరావు నివాసం. అప్పుడే ఓ అంబులెన్స్‌ వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి ఓ పండు వృద్ధురాలు ఒకరి భుజంపై చేయి వేసి నెమ్మదిగా కిందకు దిగింది. అంతే ఒక్కసారిగా మేళతాళాలు, మంగళవాద్యాలు మొదలయ్యాయి. ఆమెను చిన్నగా నడిపించుకుంటూ ఇంటి గుమ్మంలోకి తీసుకొచ్చారు. ఎదురుగా వచ్చిన ఆమె కొడుకు, కోడలు ఆమెకు కాళ్ల కడిగారు. ఆ నీళ్లను తలపై చల్లుకుంటూ.. అప్పటికే సిద్ధం చేసుకున్న పూలతో ఆమె పాదాలకు అభిషేకం చేశారు. వారితో బాటు అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులందరూ ఆమెకు పాదాభిషేకం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతూ తన కుమారుణ్ని, కోడలిని ఆలింగనం చేసుకుంది. కన్నీళ్లు ఉబికి వస్తుండగా కొడుకును ప్రేమగా ముద్దాడింది. ఈ ఘటన వయోవృద్ధురాలైన ఓ మాతృమూర్తికి పట్ల కన్నకొడుకు చూపిన ప్రేమ..  తల్లిగా ఆమె పంచిన మమకారం అతన్ని 64 ఏళ్ల వయసులోనూ చిన్నపిల్లాడిలా మార్చింది. ఆ వయసులోనూ తల్లి  కాళ్లను చుట్టేసి వదలకుండా కొన్ని నిమిషాల పాటు కన్నీళ్లతో అభిషేకం చేశాడు. కొన్ని నిమిషాల పాటు తీవ్ర భావోద్వేగాలకు లోనైన ఆ తల్లీ కొడుకులు నెమ్మదిగా తేరుకుని ఇంట్లోకి కదిలారు.

  ఆమె పేరు దారా సుబ్బమ్మ. వయసు సరిగ్గా వందేళ్లు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలకేంద్రం ఆమె స్వస్థలం. ఏభై ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. పెళ్లయిన చాన్నాళ్లకు కలిగిన ఇద్దరు కొడుకులను ఆమె ఓర్పుతో పెంచి పెద్దచేసింది. భర్త దూరమైనా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కొడుకులిద్దరినీ ప్రయోజకుల్ని చేసింది. ప్రస్తుతం ఆమె తల్లాడలోనే చిన్న కుమారుడు విష్ణుమోహనరావు వద్ద ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఆమె 95వ పుట్టినరోజును కుటుంబం అంతా ఘనంగా జరిపారు. ఆంధ్రప్రదేశ్లోని  తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి తమ తల్లికి పాదాభిషేకం జరిపారు. తండ్రి లేకపోయినా అన్నీ తానై కుటుంబం కోసం ఆమె కరిగిపోయిందని, అందుకే తమకు తల్లంటే ప్రాణమని కొడుకు చెబుతుంటాడు.  కొన్నేళ్ల క్రితం ఆమెకు పక్షవాతం రాగా, అప్పటి నుంచి మంచం మీదనే ఉంటోంది. కొడుకు, కోడలు సపర్యలు చేస్తూ ఆమెను కాపాడుకుంటున్నారు.

  ఆమెకు వైద్య సాయం, ఇంకా ఇతర సేవలు చేయడానికి ప్రత్యేకంగా ఓ మనిషిని ఏర్పాటు చేశారు. అయితే జూన్‌ నెలలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే కొడుకు ఆమెను హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పూర్తిగా కోలుకున్నాక ప్రత్యేక అంబులెన్స్‌లో ఇంటికి చేరింది. వందేళ్ల వయసులో ఆమె కరోనా వైరస్‌ను జయించి క్షేమంగా ఇంటికి చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకే అంబులెన్స్ నుంచి దిగిన ఆమెకు పాదాభిషేకంతో అపూర్వ స్వాగతం పలికారు. అయితే ఇక్కడ విషాధం ఏంటంటే గత ఫిబ్రవరిలో ఆమె పెద్ద కుమారుడు కోవిడ్‌తో మృతిచెందడం. వందేళ్ల వయసులోనూ ఆమె మాత్రం వైరస్‌ను జయించి క్షేమంగా ఇంటికి చేరడం పట్ల గ్రామస్థులు సంతోషం వెలిబుచ్చారు.
  Published by:Veera Babu
  First published: