Fake Seeds Supplied: నకిలీ విత్తనాలకు అడ్డాగా ఆ ప్రదేశం.. తీగ లాగితే డొంక కదిలింది.. పూర్తి వివరాలు ఇలా..

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

Fake Seeds Supplied: తొలకరి పలకరించింది. నకిలీ విత్తనాల దందా మొదలైంది. ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక నుంచి ఖమ్మం జిల్లాకు విత్తనాలను సరఫరా చేస్తున్న సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్‌18 తెలుగు)

  తొలకరి పలకరించింది. రైతన్న పులకరించాడు. పొలం పనులు షురూ చేశాడు. ఖరీఫ్‌కు పొలాన్ని సిద్ధం చేసుకుని.. విత్తనం నాటే దశ నెత్తిపైకి వచ్చేసింది. ఇక్కడి నుంచి రైతన్నకు ఇక్కట్లు మొదలవుతున్నాయి. రకరకాల పేర్లతో.. బ్రాండ్లతో ఆఫర్లతో ఆకర్షిస్తూ.. రైతన్నను ఆకట్టుకోడానికి వ్యాపారులు, వారి వెనుకే దళారులు తయారయ్యారు. నిర్ణీత ధరలేవీ తెలియని బ్రాండ్ల పేరిట విత్తన దశలోనే దోపిడీ మొదలైంది. సరే రేటు కాస్త ఎక్కువైనా నాణ్యమైన విత్తనం దొరుకుతుందా అంటే అదీ అందనిమావే అవుతోంది. రైతు తాను ఆరుగాలం శ్రమించిన దానికి సరైన విత్తనం లేకుంటే అంతా వృథానే. శ్రమ.. పెట్టుబడి.. కాలం అన్నీ బూడిదలో పోసిన తీరే. ఈ దిశగా ప్రతి ఏటా తొలకరిలో పలకరించే వర్షాల్లా దళారులు సైతం దిగిపోతున్నారు.

  అది కర్ణాటకకు చెందిన సంస్థ. అది విత్తనాలను విక్రయిస్తుంటుంది. అవి నాణ్యమైనవో లేదో తెలీదు. కనీస అనుమతులు లేవు. కర్ణాటకకు చెందిన ఆ సంస్థ ఎండీ చంద్రశేఖర్‌ నుంచి పల్లాపోతుల శ్రీనివాస్‌ అనే వ్యక్తి.. అతని నుంచి ఏన్కూరుకు చెందిన కుషిన్ని రోశయ్య అనే వ్యక్తి కొనుగోలు చేశారు. కేవలం పది గ్రాముల విత్తనం ధర రూ.550. ఇలా అందుకున్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరా తీసి తీగలాగితే డొంక కదిలింది. ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా సరఫరా చేసిన విత్తనాలను ఖమ్మంలోని మురళికిషోర్‌ ఆగ్రో ఫెర్టిలైజర్స్, ఖమ్మం కాల్వొడ్డులోని రవి ఫెర్టిలైజర్స్‌, తల్లాడలోని శివసాయి ట్రేడర్స్‌, జూలూరుపాడులోని ఎస్‌ఎస్‌వి ట్రేడర్స్‌, చంద్రుగొండలోని జవలి ట్రేడర్స్‌ .. ఇలా పలు దుకాణాలలో విక్రయాలు చేస్తుండగా.. ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.16 లక్షల విలువైన విత్తనాలను సీజ్‌ చేశారు. ఇది నకిలీ విత్తనాలకు సంబంధించిన దందా తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం తొలకరిలోనే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఇక రానురాను ఎలా ఉంటుందన్నది రైతన్నను భయాందోళనకు గురి చేస్తోంది.

  ఖమ్మం జిల్లాలో ఖరీఫ్‌లో 5.90 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు ఇప్పటికే రైతులు సిద్ధమయ్యారు. దీనికి గానూ 15,461 క్వింటాళ్ల వరి విత్తనం, 3.5 లక్షల పత్తి విత్తనం ప్యాకెట్లు, 69 క్వింటాళ్ల మిర్చి విత్తనం, 2,283 క్వింటాళ్ల పెసర విత్తనం, 2,600 క్వింటాళ్ల మినప విత్తనం, 739 క్వింటాళ్ల కందులు, 466 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనం రైతులకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలను అమలు చేయడానికి వ్యవసాయశాఖతో బాటు, అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈమేరకు జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించినా, ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ అంటగట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  Published by:Veera Babu
  First published: