( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీని తలపింపజేస్తూ ఖమ్మంలో ఓ నకిలీ డాక్టర్ హల్చల్ చేశాడు. ఈయన కేవలం తనకు తెలీని వైద్యం చేసి ఊరుకోలేదు. ఇంకాస్త ముందుకెళ్లి తన చోరకళా నైపుణ్యాన్ని చూపించాడు. ఏకంగా డాక్టర్లు, రోగులకు సంబంధించిన విలువైన కార్లు, సెల్ఫోన్లు చోరీ చేస్తూ తన విలాసాలను తీర్చుకునే పనిలో పడిపోయాడు. కొన్నాళ్లు ఇలా ఎంజాయ్ చేసిన ఈ మున్నాభాయ్ ఎంబీబీఎస్ పోలీసులకు దొరికిపోయాడు. తీరా విషయం తెలిసేసరికి పోలీసులు, డాక్టర్లు, రోగులు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము డాక్టర్ అనుకున్న వ్యక్తి ఇలా మున్నాభాయ్ బ్యాచ్ కేసా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఖమ్మం నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాయి. నిన్నమొన్నటిదాకా తమతో పాటు తిరిగిన వ్యక్తి చేయితిరిగిన చోరకళానిపుణుడు అని తెలిసి ఖంగుతిన్నారు. దెందుకూరి గణేష్ బాగా చదువుకున్నాడు. ఆంధ్రప్రదే శ్‌లోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి స్వగ్రామం. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. దీంతో ఏదో ఒకటి చేయాలని ఖమ్మం చేరుకున్నాడు. తెలిసిన వ్యక్తి రిఫరెన్స్ తో ఓ ప్రవేటు వైద్యశాలలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా చేరాడు. కొన్నాళ్లు నమ్మకంగా పనిచేశాడు. ఆనక అక్కడికి వృత్తి నిమత్తం వచ్చే వైద్యులతో పరిచయాలు పెంచుకున్నాడు.
మెడికల్ టెర్మినాలజీపై పట్టు సంపాదించాడు. మంచి డ్రెస్ సెన్స్‌తో.. చేతికి గ్లౌజులు, మెడకు స్టెత్‌స్కోప్, మాస్క్ పెట్టుకుని రోగులను తనకు తాను పెద్ద వైద్యునిగా నమ్మించేవాడు. ఇలా పలు దఫాలుగా డాక్టర్లకు చెందిన కార్లు, పేషంట్లకు సంబంధించిన విలువైన సెల్ఫోన్లు చోరీ చేసేవాడు. నైట్ డ్యూటీలు వేయించుకుని మరీ రౌండ్స్ పేరిట అన్ని రూంలలో తిరుగుతూ పేషంట్ల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేవాడు. పేషంట్లతో, వారి వెంట ఉన్న అటెండెంట్లతో ఆప్యాయంగా మాట్లాడుతూ, జాగ్రత్తలు చెబుతూ ఆకట్టుకునే వాడు. అప్పుడప్పుడూ పేషంట్లకు, అటెండెంట్లకు చెందిన బ్యాగులు, పర్సుల నుంచి నగదు కాజేసేవాడు. కానీ పేషంట్లతో. వ్యవహరించే తీరు, మర్యాద మన్నన చూపేవాడు. దీంతో అసలు డాక్టర్ కన్నా నకిలీ అయిన ఇతని పట్లే పేషంట్లు గౌరవం మర్యాద చూపుతుండేవారు.
ఇలా తాను అనుకున్నవిధంగా హవా సాగిస్తున్న గణేష్ తాను చోరీ చేసిన కారును, సెల్ఫోన్లు, ప్రింటర్లను తీసుకుని విజయవాడ వెళ్తుండగా పోలీసుల తనిఖీలో దొరికిపోయాడు. ఇలా ఎన్నాళ్ల నుంచి చేస్తున్నాడు.. ఎవరెవరు ఇతని బాధితులు అన్నది తేలాల్సి ఉంది. పట్టుకున్న సయమంలో గణేష్ నుంచి ఓ కారు, నాలుగు సెల్ఫోన్లు, ఓ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా తాను ఏ విధంగా చోరీలు చేసింది విని పోలీసులు విస్తుపోయారంటే ఇతని కళా నైపుణ్యం ఏపాటిదో అంచనా వేయొచ్చు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.