హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ వరద.. నిజమెంత ?

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ వరద.. నిజమెంత ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shamshabad Airport: ఎయిర్ పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని గంటల పాటు అనేక మంది కాలనీల్లోని ప్రజలు నీటిలో ఉండిపోయారు. ఇదంతా కళ్ల ముందు కనిపించిన వాస్తవ దృశ్యాలు. అయితే హైదరాబాద్ వరదల విషయంలో కొందరు లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వరదలకు సంబంధించిన పాత వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వీడియో గురించి అసలు విషయం తెలియక అనేక మంది దీన్ని సర్కులేట్ చేస్తున్నారు.

మరికొందరు ఈ వీడియోను బేస్ చేసుకుని జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇది శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వీడియో కాదని పేర్కొంది. ఇది పాత వీడియో అని వెల్లడించింది. కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ వీడియోను సర్కులేట్ చేస్తున్నారని తెలిపింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసినప్పటికీ.. ఎయిర్ పోర్ట్‌లో మాత్రం పరిస్థితులు, కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సీజన్‌లో కురవాల్సిన మొత్తం రికార్డును ఇప్పుడే నమోదు చేశాయి. బుధవారం ఉదయం నాటికే ఏకంగా 12.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో కురిసే వానలు కేవలం సీజన్‌ ప్రారంభమైన రెండు వారాల్లోనే నమోదు కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయం నాటికి 5.87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సీజన్‌ ముగిసే నాటికి కేవలం 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నైరుతి సీజన్‌లో కూడా సాధారణ వర్షపాతం కంటే 45 శాతం అధికంగా నమోదయ్యాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రంలో 72 సెంటీమీటర్ల వర్షపాతానికి గాను 107.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

First published:

Tags: Hyderabad Heavy Rains, Shamshabad Airport, Telangana

ఉత్తమ కథలు