ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వాటిలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదు. కొన్నిసార్లు అసత్యాలను కూడా నిజాలుగా భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా గతంలో ఎక్కడో జరిగిన పాత వీడియోలను తిరిగి ప్రచారంలోకి వస్తున్నాయి. చాలా మంది తమకు తెలియకుండానే వాటిని షేర్ చేస్తున్నారు. దీంతో ఇవి కాస్త వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బెజ్జూరు అటవీ ప్రాంతంలో(Ambaghat forest in Kukuda village in Karjelli range) పులి సంచరిస్తుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. పశువుల కాపరులకు పులి కనిపించిందని.. ఓ వీడియో వాట్సాప్ గ్రూప్లో షేర్ అవుతోంది.
ఇది చూసిన బెజ్జూరు అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం కాస్త అటవీ అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఆ వీడియోకు సంబంధించిన వాస్తవాలను చేధించారు. ఆ వీడియో గురించి విచారణ చేపట్టిన అధికారులు అది మహారాష్ట్రకు చెందిన పాత వీడియోగా నిర్ధారించారు. యావత్ మల్ జిల్లా అంజన్ వాడి అటవీ ప్రాంతంలో గత నెలలో పులి కనిపించిన వీడియోను కొందరు యువకులు తప్పుగా సర్క్యులేట్ చేశారని గుర్తించారు. బెజ్జూర్ ప్రాంతంలో పులి కనిపించదంటూ వాట్సాప్లో షేర్ చేశారని ఆదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) వినోద్ కుమార్ తెలిపారు.
ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని, సరిహద్దు అటవీ ప్రాంతంలో పులుల సంచారంపై శాఖాపరంగా అప్రమత్తంగా ఉన్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఒక్క అసిఫాబాద్ జిల్లాలోనే 32 ప్రత్యేక బృందాలు, కెమెరా ట్రాప్ లు, వాచర్ల ద్వారా పులులు కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తప్పుడు సమాచారంతో కొన్ని పత్రికలు కూడా శనివారం(21-11-2020) రోజున పులి సంచారంపై వార్తలు ప్రచురించాయని అన్నారు. స్థానిక అటవీ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నాకే పులి సంచారంపై తగిన సమాచారాన్ని ప్రజలకు అందజేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Fact Check, Tiger