ఎల్ఆర్ఎస్ అందుకే.. ఆ బాధ్యత వారిదే అన్న సీఎం కేసీఆర్

ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చూడాలని తెలిపారు.

news18-telugu
Updated: September 24, 2020, 8:21 PM IST
ఎల్ఆర్ఎస్ అందుకే..  ఆ బాధ్యత వారిదే అన్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా వలసపాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు పరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదే అన్నారు. భూములను క్రమబద్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోపాటు, రాష్ట్రంలోని అన్ని మిగతా పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలేకాకుండా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Dharani website, cm kcr news, telangana news, telangana registrations, ధరణి వెబ్‌సైట్, సీఎం కేసీఆర్ న్యూస్, తెలంగాణ న్యూస్, తెలంగాణలో రిజిస్ట్రేషన్లు
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)


దూసుకుపోతున్న తెలంగాణ
తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారని... కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నదని కేసీఆర్ అన్నారు. సుస్థిరపాలన వల్ల భూ తగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గిందని వ్యాఖ్యానించారు. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసిందని.. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారని అన్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారని.. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారని అన్నారు. పేదరికానికి కులం, మతం లేదని.. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనదని సీఎం కేసీఆర్ తెలిపారు.

Andhra Pradesh news, Telangana news, Cm kcr news, ys jagan news, trs news, ysrcp news, ఏపీ న్యూస్, తెలంగాణ న్యూస్, సీఎం కేసీఆర్ న్యూస్, వైఎస్ జగన్ న్యూస్, వైసీపీ న్యూస్
సీఎం కేసీఆర్


ఆన్‌లైన్‌లోకి ప్రతి అంగుళం భూమిగుణాత్మక మార్పుకోసం, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినపుడు గరీబులకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి వెబ్ పోర్టల్ ను వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్ పుస్తకాలను, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఒకనాడు స్లమ్ ఏరియాల్లోని గుడిసె నివాసాలు అభివృద్ధితో నేడు పక్కా ఇండ్లు, బంగళాలుగా మారాయని... ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారని... వారి గుండె తీసి మన చేతుల్లో పెట్టారని కేసీఆర్ అన్నారు. చారిత్రిక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించ వలసిన బాధ్యత ఉన్నదని తెలిపారు. నోటరీ, జీవో 58,59 ద్వారా పట్టాలు పొందిన లబ్దిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు.

సీఎం కేసీఆర్


ఆ బాధ్యత నాయకులు, అధికారులదే
ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చూడాలని తెలిపారు. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్ డేట్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం మాట్లాడించారు. వారి వారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాస స్థలాలు, ఇండ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, ప్రతి సమస్యనూ అధికారులతో నోట్ చేయించారు. ఈ సమస్యల తక్షణమే పరిష్కారం కోసం విధి విధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, తమ రాజకీయ జీవితంలో హైదరాబాద్ తోపాటు, రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన ముఖ్యమంత్రిని తాము ఇంతవరకూ చూడలేదని సమావేశంలో పాల్గొన్న సీనియర్ ప్రజా ప్రతినిధులు సంబ్రమాశ్చర్యాలను వ్యక్తం చేశారు. పట్టణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading