Dalitha Bandhu: రేపే దళితుల ఖాతాల్లో రూ.10లక్షలు.. వాసాలమర్రిలో దళిత బంధు ప్రారంభం

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్

వాసాలమర్రిలో ఇవాళే దళిత బంధు ప్రారంభమయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలు ఉన్నాయి. వారందరి ఖాతాల్లో గురువారం రూ.10లక్షల జమకానుంది.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తన దత్తత గ్రామం వాసాలమర్రిలో రేపటి నుంచే దళిత బంధు పథకం అమలవుతుందని ఆయన చెప్పారు. గ్రామంలోని 76  కుటుంబాలకు రేపే రూ.10లక్షలు అందుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ దళిత బంధు ప్రారంభమయిందని ఆయన ప్రకటించారు.  వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలు ఉన్నాయి. వారందరి ఖాతాల్లో గురువారం రూ.10లక్షల జమకానుంది. ఈ డబ్బులు ఎలా ఖర్చు చేసుకుంటారో మీ ఇష్టం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఐతే అనవసరంగా వృథా చేయకూడదని.. భవిష్యత్‌పై భరోసా కల్పించేలా వినియోగించుకోవాలని సూచించారు.

    '' వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు రేపే దళిత బంధు డబ్బులను ఖాతాల్లో జమచేస్తాం. దళిత బంధు సాయం అందినా ఇతర పథకాలు కొనసాగుతాయి. ఏవీ ఆగిపోవు. ఆ డబ్బుల్లో 10 రూపాయలు కాదు 10 పైసలు కూడా వృథా చేయొద్దు. 10 లక్షల్లో 10 రూపాయలు తగ్గించి ఇస్తాం. వాటితో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా ఆపద వస్తే దళిత బంధుు రక్షణ నిధి డబ్బులను వినియోగించుకోవచ్చు. దళిత బంధు నిధులతో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇస్తం.'' అని సీఎం కేసీఆర్ తెలిపారు.

    వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ కూడా జరగాలని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామంలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందని, ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల తర్వాత వాసాలమర్రికి వస్తానని.. దళితులతో కలిసి తాను భోజనం చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.10 లక్షల డబ్బును దేనికి ఉపయోగించుకుంటారో తనకు చెప్పాలని అన్నారు. ఆ రోజున అందరం కలిసి విందు చేసుకుందామని ఆయన అన్నారు.

    యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రి లోని దళిత వాడల్లో సీఎం కేసీఆర్ బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించారు. దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. దళిత వాడల్లోని సుమారు 60 ఇండ్లలోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలను కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బందు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు.

    ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు..? దళిత బందు డబ్బులు వస్తే ఎం చేద్దాం అని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు..? కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని కొందరు ట్రాక్టర్ లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలిపారు. రైతు వేదిక భవనంలో సమావేశం అనంతరం.. సర్పంచ్ ఇంట్లో భోజనం చేశారు సీఎం కేసీఆర్. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

    ఇవి కూడా చదవండి:

    WEL COME TO PV SINDHU :హైదరాబాద్‌లో పీవీ సింధూకు ఘనస్వాగతం..

    CM KCR: వాసాలమర్రిపై సీఎం కేసీఆర్ వరాల జల్లు.. దళితవాడలో ఇంటికి వెళ్లి సమస్యలపై ఆరా
    Published by:Shiva Kumar Addula
    First published: