మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరికాసేపట్లోనే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన.. మరికాసేపట్లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నడ్డాను కలవనున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరికకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. రాష్ట్ర పార్టీలో తన పాత్ర ఏ రకంగా ఉంటుందనే అంశంపై నడ్డాతో చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు నడ్డాతో సమావేశం అనంతరం తాను బీజేపీలో చేరబోతున్నట్టు ఈటల రాజేందర్ ప్రకటన చేస్తారా ? లేక ఇందుకోసం మరికొంత సమయం తీసుకుంటారా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోవడంతో ఆయన ఢిల్లీ పెద్దల సమక్షంలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికార పార్టీపై పోరాటానికి సిద్ధం కావాలనే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్పై పోరాటం చేసే విషయంలో బీజేపీ అండతో దూకుడుగా ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ గూటికి చేరాలని దాదాపుగా ఫిక్సయిన ఈటల రాజేందర్.. దీనిపై ఢిల్లీలో ప్రకటన చేస్తారా ? లేక తెలంగాణకు వచ్చిన తరువాత పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.