తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన కుటుంబసభ్యులు భూకబ్జాలకు పాల్పడ్డారనేే ఆరోపణలు, వార్తలు తెలంగాణలో సంచలనం రేకెత్తించాయి. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ముద్ర ఉన్న టీ న్యూస్ చానల్లో సాక్షాత్తూ మంత్రి మీద ఆరోపణలకు సంబంధించిన వార్తలు ప్రసారం కావడం రాజకీయవర్గాల్లో సంచలనానికి దారి తీసింది. టీ న్యూస్ తో పాటు మరికొన్ని న్యూస్ చానళ్లు కూడా ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారనే వార్తలను ప్రసారం చేశాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల భూ కబ్జాలకు పాల్పడ్డారని సుమారు 100 ఎకరాల భూములను ఆయన వర్గం కబ్జా చేసిందనేది ఆ వార్త సారాంశం. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. అటు అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్షాల్లో కూడా ఈ వార్త ఆసక్తికరంగా మారింది.
ఆయా చానళ్లలో ప్రసారం అయిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి .. మంత్రి ఈటల రాజేందర్, ఆయన భార్య జమున, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో 100 ఎకరాల అసైన్ లాండ్‌ను కబ్జాకు యత్నించారని ఆరోపించారు. ఓ పౌల్ట్రీ ఫాం పేరుతో ఈ కబ్జాలకు ప్రయత్నించారని తెలిపారు. జమున హాచరీస్ పేరుతో ఆ భూములను కబ్జా చేశారని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాను కూడా ఆ భూములు ఇవ్వడం కుదరదని చెప్పినట్టు అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపినట్టు ఆయా చానళ్లలో వార్తలు వచ్చాయి.
మరోవైపు మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు యత్నిస్తున్నారంటూ కొందరు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో ఉన్న వివరాల ప్రకారం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కుదరదన్నా అధికారులపై ఒత్తిడి తెచ్చి భార్య జమున, కొడుకు నితిన్‌రెడ్డి పేరుతో అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధిత రైతులు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఉంది. అచ్చంపేట, హకీంపేట ప్రాంతంలో సుమారు 100 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేశారని అందులో పేర్కొన్నారు.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని మంత్రి కబ్జా చేసినట్లు ఆ ఫిర్యాదులో రైతులు పేర్కొన్నారు.
మరోవైపు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eatala rajender, Eatela Rajender, Huzurabad By-election 2021, Jamuna hatcheries, Land scam, Minister Eetala Rajender