news18-telugu
Updated: December 29, 2020, 10:47 AM IST
సాగు పనుల్లో యువరైతు
అతను చదివింది ఇంజనీరింగ్ విద్య. ఉద్యోగంలో చేరితే చెమట అంటకుండా ఏసీ రూముల్లో పని చేస్తూ ఐదెంకలకు మించిన జీతం పొందడం ఖాయం. కానీ ఆ యువకుడు అందరిలా ఆలోచించలేదు. ఉద్యోగం కోసం పాకులాడలేదు. తనకున్న ఐదెకరాల పొలంలో పండ్లతోటల పెంపకం చేపట్టి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతేకాదు మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా లాండ సాంగ్వి గ్రామానికి చెందిన అంకత్ వార్ రవిశేఖర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా వ్యవసాయ రంగంలో అడుగుపెట్టాడు. తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో తైవాన్ జామను సాగు చేశాడు. అధిక లాభాలు పొందుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తూ అభినందనలు అందుకుంటున్నాడు. అర్లీ(బీ) గ్రామ సమీపంలో తమకున్న వ్యవసాయ క్షేత్రంలో ఐదెకరాలలో 2017 లో తైవాన్ జామను సాగు చేసాడు.
మొత్తం ఐదెకరాలలో తైవాన్ జామ సాగుతో పాటు డ్రిప్, చేను చుట్టూ కంచె వేయడానికి 11లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. ఆరు నెలలకే అతడికి మొదటి పంట వచ్చింది. కానీ మొదటి పంట అంత ఆశజనకంగా లేకపోయినా.. రెండో పంట వచ్చేసరికి మంచి దిగుబడి వచ్చిందని యువ రైతు చెబుతున్నాడు. సుమారు 270 క్వింటాళ్ళ వరకు దిగుబడి వచ్చిందని, ఇంకా సుమారుగా రెండు వందల క్వింటాళ్ల వరకు రావచ్చని భావిస్తున్నాడు. పంటను తాను అమ్ముకునేంత సమయం లేక, స్థానిక వ్యాపారులకు క్వింటాల చొప్పున అమ్ముతూ ఆదాయం పొందుతున్నాడు.
ఇలా మొత్తం తమ పంట ఖర్చులు వెళ్ళిపోయాయని ఇక రావాల్సింది లాభాలే అని రైతు అంకత్ వార్ రవిశేఖర్ పేర్కొన్నాడు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఇలా వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి అద్భుతం సాధించిన ఈ యువ రైతు రవిశేఖర్ ను అందరు అభినందిస్తున్నారు. నేటి నిరుద్యోగులు ఈ యువకుడిని ఆదర్శంగా తీసుకుని వ్యవసాయంలో రాణించాలన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.
Published by:
Nikhil Kumar S
First published:
December 29, 2020, 10:38 AM IST