హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఇవాళ మరోసారి విచారణ

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఇవాళ మరోసారి విచారణ

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

Telangana: తెలంగాణలో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దుమారం రేగుతుండగా.. ఇప్పుడు ఫెమా కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారించడం.. చర్చనీయాంశంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రమేయం ఉందని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈడీ కూడా అధికార పార్టీ నేతల అనుచరులను విచారించడంతో రాజకీయ దుమారం రేగింది. ఐతే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే ఈడీ విచారించింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (Manchireddy KishanReddy)ని దాదాపు 8 గంటల పాటు విచారించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం 11:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి..రాత్రి 9 గంటల సమయంలో బయటకు వచ్చారు.

  2014లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఆయన్ను విచారించినట్లు సమాచారం. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 ఆగస్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ఎక్ఛేంజ్‌ ద్వారా 2వేల డాలర్లు తీసుకున్నారు. అప్పటి మారక విలువ ప్రకారం.. ఆ విలువ లక్షా 20వేల రూపాయలు. దీనిని అనుమానాస్పద లావాదేవీగా భావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... 2018లోనే నోటీసులు జారీచేసింది. ఈడీ నోటీసులకు అప్పట్లోనే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది. సెప్టెంబరు 23న విచారణకు రావాలని చెప్పింది. కానీ ఇతర కేసులతో బిజీగా ఉండడం వల్ల ఆయన హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుధవారం మరోసారి విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలో గోల్డ్‌ మైనింగ్‌లో పెట్టుబడులపైనా విచారించనున్నట్లు సమాచారం.

  మంగళవారం ఈడీ విచారణ అనంతరం మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈడీ ఆఫీసు వెనుక గేటు నుంచి బయటకు వచ్చి.. తన కారులో వెళ్లిపోయారు. ఈ కేసుపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దుమారం రేగుతుండగా.. ఇప్పుడు ఫెమా కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారించడం.. చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఏయే కేసుల్లో ఎవరెవరిని విచారిస్తారోనని టీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఐతే ఈడీ కేసులకు భయపడే ప్రసక్తే లేదని కొందరు టీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తప్పు చేయన్నప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మంచిరెడ్డి ఇబ్రహీంపట్నంలో భూ కబ్జాలు చేసి కోట్లు గడించారని.. హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు పంపించారని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఈడీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి..ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Enforcement Directorate, Telangana, Trs

  ఉత్తమ కథలు