మావోయిస్టుల ఏరివేత దిశగా తెలంగాణ పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు. ప్రస్తుతం దేవళ్లగూడెంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి కొందరు మావోయిస్టుల పారిపోయారన్న సమాచారంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, జులై 15న కూడా భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు గాయపడగా.. 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి కాల్పులు జరగడంతో భద్రాలచం ఏజెన్సీ ఉలిక్కిపడింది.
ఏజెన్సీలో డీజీపీ పర్యటన
ఇక ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహకంలోని ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీకి వెళ్లడం ఇది రెండోసారి.
మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన అనుచరులు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి గత రెండేళ్ల క్రితమే అనారోగ్య కారణాల వల్ల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకొన్నారు. తీవ్ర అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మాటలోనే మరికొందరు మావోయిస్టులు లొంగిపోయే అవకాశముంది. ఇక ఇటీవల ఆదిలాబాద్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టు భాస్కర్ రావు డైరీ దొరికింది. అందులో మావోయిస్టు డైరీలో కొందరు ప్రముఖ మావోయిస్టుల పేర్లున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన చర్చనీయాంశమైంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.