(K.Veeranna,News18,Medak)
ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రజలకు పెద్ద చిక్కొచ్చి పడింది. పెట్రోల్ భారం, కాలుష్యంతో ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎలక్ట్రిక్ బైకు (Electric bike)లు కొనుగోలు చేస్తుంటే అవి కొనుగోలు చేసిన గంటలు, రోజుల వ్యవధిలోనే ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల్లోంచి మంటలు రావడం, తగలబడిపోవడం, అగ్నిప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. తెలంగాణ(Telangana)లో రోజుకు ఏదో ఓ చోట ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో కాలిపోతున్న వార్తలు వాహనదారులను భయపెడుతున్నాయి. తాజాగా సిద్దిపేట(Siddipeta) జిల్లాలో చార్జింగ్ పెట్టిన ఒక ఎలక్ట్రిక్ వాహనంలోని బ్యాటరీ పేలిపోయింది. దాంతో బైక్‌తో పాటు పార్క్ చేసిన ఇల్లు(House fire) కూడా పూర్తిగా దగ్ధమైంది.
ఎలక్ట్రిక్ బైక్ బ్లాస్ట్..
దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని దుర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందర చార్జింగ్ పెట్టాడు. అయితే అనుకోకుండా రాత్రి సమయంలో బైక్ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తి కాలి దగ్దమైంది. ఈప్రమాదంలో కేవలం బైక్ పూర్తిగా తగలబడిపోగా..ఇల్లు దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా తెలంగాణలోనే జరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలన్న, వాటిని కొనుగోలు చేయడానికి కూడా జనం జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
బైకు, ఇల్లు రెండూ దగ్ధం..
పెరుగుతున్న ఇంధన ధరలు ఓవైపు.. కోరలు చాస్తున్న కాలుష్యం మరోవైపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ రెండు సమస్యల నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు జనం. ఫలితంగా మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. వినియోగదారుల డిమాండ్‌కు తగిన విధంగా మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్న సంస్థలు తయారి విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
భయపడుతున్న వాహనదారులు..
అయితే ఇవి వాహనాల తయారిలో లోపం కాదని ..వేసవి తీవ్రతతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ పూర్తైన తర్వాత చార్జింగ్ ఆఫ్ చేయకపోవడం వల్లేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటిక వరకు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు రావడం, బైకులు కాలిపోవడం మాత్రమే జరిగాయి. తాజాగా సిద్దిపేటలో బైక్‌తో పాటు ఇల్లు కూడా దగ్ధమవడం కలకలం రేపింది. ఇక్కడే కాదు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కూడా చాలా చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమైన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఇంధనం, గ్యాస్‌తో నడిచే వాహనాలు కొనుగోలు చేసుకుంటే మంచిదనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Siddipeta, Telangana