Telangana: తెలంగాణలో మరో ఎన్నికలు.. హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందుగానే..

తెలంగాణ మ్యాప్

Telangana: ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. జూన్ 3వ తేదీతో ఆరుగులు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది.

  • Share this:
    తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం నడుస్తోంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు, పార్టీల రాజకీయాలన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా.. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే తెలంగాణలో మరో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తునాయి. శాసనసభ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

    ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. జూన్ 3వ తేదీతో ఆరుగులు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. పదవీకాలం ముగిసిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహ్మద్ పరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి గడువు ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం.

    అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు చక్కబడటం, సాధారణ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో.. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో మరో ఎన్నికలు జరగడం ఖాయమని చెప్పొచ్చు.
    Published by:Kishore Akkaladevi
    First published: