MLC Kalvakuntla Kavitha | Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 3 సార్లు ఈడీ ముందుకు వచ్చిన కవిత గత ఏడాదికాలంగా వాడిన 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు ఆ 10 ఫోన్లలో డేటాను తీసే పనిలో నిమగ్నమయ్యారు. కవిత లాయర్ సోమా భరత్ సమక్షంలో గత 2 రోజుల నుంచి ఫోన్లను ఓపెన్ చేసి అందులో డేటాను..అలాగే డిలీట్ చేసిన డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు ఈడీ వర్గాల సమాచారం. ఇక ఇందుకోసం సాంకేతిక ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కవిత సమర్పించిన ఫోన్లలో డేటాను సేకరించిన అనంతరం దానిని విశ్లేషించి షాని ఆధారంగా కవితకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలనుకుంటున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
ఫోన్ల ఓపెన్..డేటా రికవరీ..
కాగా మంగళవారం, బుధవారాల్లో కవిత ప్రతినిధి సోమా భరత్ ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. ఆయన సమక్షంలోనే ఈడీ అధికారులు ఫోన్లను ఓపెన్ చేసి డేటాను సేకరిస్తున్నారు. కవిత అప్పగించిన 10 ఫోన్లలో 3 ఫోన్లలో సమాచారాన్ని సేకరించారు. ఇక రెండో రోజు కూడా మరో 2 ఫోన్లను అధికారులు ఓపెన్ చేశారు. మొత్తం 5 ఫోన్లను ఓపెన్ చేసిన ఈడీ అందులోని సమాచారాన్ని సాంకేతిక సాయంతో బయటకు తీస్తున్నారు. అయితే మిగతా ఫోన్ల ఓపెన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మరో 5 ఫోన్లు ఓపెన్ చేయాల్సి ఉండగా..వాటి డేటాను రిట్రీవ్ చేసి విశ్లేషించి ఆపై కవితను దానికి సంబంధించి ప్రశ్నలను అడగాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఫోన్ డేటా ఆధారంగా కేసులో నిందితులు లేదా అనుమానితులతో చాటింగ్ డేటా, కాల్స్ డేటా, డాక్యూమెంట్ల షేరింగ్ సహా ఇతర కీలక అంశాలకు సంబంధించి వివరాలను రాబట్టాలని యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితుల నుంచి చాలా సమాచారాన్ని అటు ఈడీ, ఇటు సీబీఐ సేకరించింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి నిధుల గురించి..అలాగే ఎవరి పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసులో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు సహా హైదరాబాద్ కు చెందిన పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే ఎమ్మెల్సీ కవిత 4 ఫోన్లు మార్చారని..మరిన్ని ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. అంతేకాదు మొత్తం 36 మంది 70 ఫోన్లు మార్చారని ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఫోన్ లో డేటా రికవరీ ద్వారా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. ఆ సమయంలో కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే 11న కవితను విచారించిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్న కారణంగా ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు రాలేనని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. ఆరోజు నెలకొన్న హైడ్రామాతో విచారణ జరగలేదు.
అయితే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీనితో ఆమె విచారణకు హాజరు కాక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పగా..21న కూడా కవిత విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీకి స్టీల్ కవర్ లో అప్పగించారు. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 3 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది.
అయితే ఫోన్లు ఓపెన్ చేసి డేటా రికవరీ చేసిన ఈడీ అధికారులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ డేటా ఆధారంగా ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana