పూరి జగన్నాధ్, చార్మీలను ఈడీ విచారించింది. 13 గంటలపాటు సాగిన ఈ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. లైగర్ సినిమా నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో విదేశీ పెట్టుబడులు, ఇతర పెట్టుబడుల గురించి ఈడీ ఆరా తీసింది. ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మిలు నిర్మించారు. ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారనే అనుమానంతో ఈడీ పూరి జగన్నాథ్, చార్మిలకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీసులో పూరీ జగన్నాథ్,(Puri Jagannadh) చార్మిలను(Charmi) అధికారులు విచారించారు. ఉదయం నుంచి పూరీ, చార్మీని ఈడీ అధికారులు విచారించారు. 15 రోజులక్రితమే పూరీకి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, చార్మిలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పూరి జగన్నాథ్, చార్మిలతో పాటు ఇతరులకు కూడా క్లీన్ చిట్‌ను ఇచ్చింది ఈడీ. తాజాగా పరిణామాలలో ఈడీ విచారణలో పూరి జగన్నాథ్, చార్మీ ఏం చెప్పారు? విచారణ అనంతరం ఏయే విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో(Delhi Liquor Scam) పాటు క్యాసినో వ్యవహారాల్లో విచారణను వేగవతం చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని, దీనిలో కవిత కూడా ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో ఈడీ విచారించిన క్యాసినో కేసు తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌ని పలుమార్లు విచారించిన ఈడీ.. తాజాగా ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు నోటీసులు అందించడం సంచలనంగా మారింది.
వీరిలో సినీ నటులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని తెలిసింది. నేపాల్ ఈవెంట్‌కు సంబంధించిన ఆధారాల్లో భాగంగా తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేశ్, ధర్మ యాదవ్‌లని ఈడీ విచారించింది. ఇక ఈ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణకు, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మెదక్ డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. టీఆర్ఎస్కు చెక్ పెట్టేలా ఇదంతా బీజేపీనే చేయిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాల్లో ఈడీ దాడులతో టీఆర్ఎస్ నేతల్లో కలవరం పెరిగింది.
Corruption: డిప్యూటీ సీఎం ఇలాకాలో అవినీతి చేప.. చేయి తడిపితేేనా ఏ పనైనా..?
ఇదిలా ఉంటే లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారని.. దీనిపై ఈడీ విచారణ చేపట్టాలని గతంలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు కవిత లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. తాజాగా ఈడీ లైగర్ సినిమా నిర్మాణంలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే దానిపై ఆరా తీయడంతో.. ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.