MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుసగా రెండో రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. దాదాపు 7 గంటలకు పైగా ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ఈడీ ఆఫీస్ లోని 3వ ఫ్లోర్ లో కవితను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో కవిత ఈడీ విచారణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
కవితను అధికారులు విచారిస్తున్న క్రమంలో లీగల్ టీంకు ఈడీ పిలుపునిచ్చారు. దీనితో కవిత లీగల్ టీం సోమాభరత్, దేవి ప్రసాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలను తీసుకొని వారు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఉన్నట్టుండి విచారణ మధ్యలో కవిత లీగల్ టీంను ఈడీ రప్పించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవాళ కవిత అరెస్ట్ కాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో లీగల్ టీంను కార్యాలయానికి రప్పించడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
Read Also : Kavitha: కవిత అరెస్ట్ అవుతుందా లేదా అని జోరుగా బెట్టింగ్! కోట్లు మారుతున్న చేతులు
కాగా ఉదయం 11 గంటల సమయానికి ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవిత..ఇంకా బయటకు రాలేదు. సుమారు 7 గంటలకు పైగా ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా ఆమె ఫోన్లకు సంబంధించి అంశాలపై విచారిస్తున్నట్టు సమాచారం. కవిత తన ఫోన్ లను ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆమె తన సెల్ ఫోన్లను తీసుకెళ్లారు. ఈ క్రమంలో మీడియాకు కూడా ఆ ఫోన్లను చూపించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి కవిత ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారనేది తెలియాల్సి ఉంది. గత విచారణ మాదిరిగానే ఈరోజు కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. అక్కడకు కేవలం విచారణకు వచ్చిన వారు, పోలీసులు, మీడియా మినహా మిగతా ఎవరిని అనుమతించట్లేదు. నేడు కవిత ఈడీ విచారణలో ఏం జరగబోతుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana