Eatala Rajender: కరోనాపై నిత్య యుద్ధం.. ఏడాదిగా ఒక్క సెలవు కూడా తీసుకోని తెలంగాణ మంత్రి..

ఈటల రాజేందర్ (ఫైల్)

కరోనా రాష్ట్రంలోకి ప్రవేశించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం 8 గంటలకు గాంధీ ఆసుపత్రి సందర్శించనున్నారు.

 • Share this:
  కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. కరోనా లాక్‌డౌన్ విధించాక.. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసులకు సెలవులు పెట్టారు. వైరస్‌‌కు భయపడి బయటకు రాలేదు. ఐతే కరోనా అదుపులోకి రావడంతో ఇప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ గత ఏడాది పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అందరికీ తెలిసిందే. ఐనప్పటికీ తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం.. కరోనా కాలంలో.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. కనీసం విశ్రాంతి కూడా తీసుకోలేదు. డాక్టర్లు, నర్సులు ఆస్పత్రుల్లో ఎంత కష్టపడ్డారో.. ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల కూడా అలాగే శ్రమించారు. అనునిత్యం కరోనా గురించి సమీక్షలు, ఆస్పత్రుల సందర్శనలు, క్షేత్ర స్థాయిలో కోవిడ్ పరిస్థితి గురించి చర్చలు, మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. ఈయన డైలీ డ్యూటీ ఇదే.

  తెలంగాణలోకి కరోనా వ్యాధి ప్రవేశించి మంగళవారానికి ఏడాదవుతోంది. గత ఏడాది మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్.. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. ఈ 365 రోజులు మొత్తం కరోనా చుట్టే గడిచిపోయాయి. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని ఆయన ఒక సవాల్‌గా తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కోవిడ్‌ను తరిమికొట్టేందుకు అనునిత్యం కృషిచేశారు. ఇలా ప్రతి క్షణం కరోనా నివారణ గురించి ఆలోచించబట్టే.. సరైన చర్యలు తీసుకోబట్టే.. తెలంగాణలో ప్రస్తుతం కరోనా చాలా అదుపులోకి వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

  కరోనా రాష్ట్రంలోకి ప్రవేశించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం 8 గంటలకు గాంధీ ఆసుపత్రి సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

  '' సవాళ్లను ఎదుర్కోవడంలో సహజ గుణం కలిగిన తెలంగాణ సమాజం కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. కరోనా రక్కసి ఒక పక్కన ప్రపంచంలో మరణమృదంగం మోగించినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల నామమాత్రపు హానితోనే బయటపడింది. ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం కూడా తోడు కావడంతో కరోనా పై పోరాటం కూడా ఉద్యమ స్థాయిలో నడిచి జనజీవనం ఏడాది తిరగకుండానే సాధారణ స్థాయికి చేరుకుంది. కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య విపత్తు సంభవించినా ఎదుర్కొనే సామర్థ్యం ను, నైపుణ్యాన్ని,  అనుభవాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొగలిగింది.'' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

  సొంత వారు కూడా దగ్గరికి రాని సమయంలో ప్రేమ, ఆప్యాయతలతో ధైర్యంగా చికిత్స అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్స్‌కి, పారిశుద్ధ్య కార్మికులకు,  పోలీసులకు కరోనా మహమ్మారి పై పోరాటం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. అని ఈటల రాజేందర్ అన్నారు. కరోనా  వ్యాక్సిన్నే ఈ మహమ్మారిని పారద్రోలడానికి శాశ్వత పరిష్కారమని.. వాక్సిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భయాందోళనలు లేకుండా ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈటల. ప్రభుత్వం సూచించిన సలహాలు సూచనలు పాటించాలని.. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి కొనసాగించాలని సూచించారు. కాగా, సోమవారం మంత్రి ఈటల రాజేందర్ కోవిడ్ వాక్సిన్ వేసుకున్న విషయం తెలిసిందే.
  Published by:Shiva Kumar Addula
  First published: