హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka Byelection Result: దుబ్బాకలో కౌంటింగ్ సగం పూర్తి.. ఆధిక్యంలో బీజేపీ

Dubbaka Byelection Result: దుబ్బాకలో కౌంటింగ్ సగం పూర్తి.. ఆధిక్యంలో బీజేపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By election Result: దుబ్బాకలో ఓట్ల లెక్కింపు సగం పూర్తయ్యింది. మొత్తం 23 రౌండ్లలో 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కావడం.. తొలి సగంలో టీఆర్ఎస్‌పై బీజేపీ పైచేయి సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

  తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల ఓటింగ్‌కు సంబంధించిన కౌంటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. పోలైన ఓట్లలో సగానికిపైగా ఓట్ల లెక్కింపు కూడా పూర్తయ్యింది. మొత్తం 23 రౌండ్లు ఉంటే కౌంటింగ్‌లో 12వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్‌పై బీజేపీ 4030 ఓట్ల ఆధిక్యంతో ముందుంది. 12వ రౌండ్‌లో 83 ఓట్ల కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. 12వ రౌండ్ ముగిసే నాటికి బీజేపీకి వచ్చిన ఓట్లు 36745 కాగా, టీఆర్ఎస్‌కు 32715, కాంగ్రెస్‌కు 10662 ఓట్లు వచ్చాయి. దుబ్బాక ఓట్ల లెక్కింపులో బీజేపీ ఎక్కువగా మెజార్టీ కనబరుస్తోంది. తొలి ఐదు రౌండ్లలో బీజేపీకి మెజార్టీ రాగా, 6,7,10 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్‌కు ఆధిక్యత వచ్చింది. 10 రౌండ్ల తరువాత పుంజుకున్న కాంగ్రెస్ 12 రౌండ్‌లో స్వల్ప మెజార్టీ వచ్చింది.

  ఇప్పటివరకు కొనసాగిన కౌంటింగ్ సరళిని బట్టి బీజేపీ, టీఆర్ఎస్ విజయం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయని స్పష్టమవుతోంది. గతంలో దుబ్బాకలో టీఆర్ఎస్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ.. ఈసారి మాత్రం మెజార్టీ రౌండ్లలో ఆ పార్టీ కంటే మెరుగైన ఓట్లు సాధించడం గులాబీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. ఏ రౌండ్‌లోనూ బీజేపీపై టీఆర్ఎస్‌కు భారీ మెజార్టీ రాకపోవడంతో.. ఇదే పరిస్థితి మిగతా రౌండ్లలో కొనసాగితే బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  14 టేబుళ్ల మీద 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎవరు గెలుస్తారనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతోంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు