హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka ByElection 2020: దుబ్బాక ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్... మండల ఇంఛార్జ్‌ల నియామకం

Dubbaka ByElection 2020: దుబ్బాక ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్... మండల ఇంఛార్జ్‌ల నియామకం

దుబ్బాక ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ (File)

దుబ్బాక ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ (File)

Dubbaka ByElection 2020: దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఆ దిశగా మండల ఇంఛార్జ్‌లను ప్రకటించింది. ఒక్కో మండలానికీ సీనియర్ నాయకులను నియమించింది.

  Dubbaka ByElection 2020: సిద్ధిపేట జిల్లా... దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాలుగా తీసుకుంది. ఇందులో గెలవడం ద్వారా... అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది అని నిరూపించాలనుకుంటోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పార్టీ మండల ఇంఛార్జ్‌లను ప్రకటించింది. 8 మండలాలకు ప్రాధాన్య క్రమంలో ముఖ్యనాయకులను ఇంఛార్జులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియమించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను ఇంఛార్జులుగా నియమించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు.

  ఉత్తమ్, రేవంత్, సీతక్క:

  దుబ్బాక మండలానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డిలు ఉన్నారు. మిర్దొడ్డి మండలానికి ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, సురేష్‌షెట్కార్‌, శ్రీశైలం గౌడ్‌లను నియమించారు. అలాగే... తోగుట మండలానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌లను నియమించారు. దౌల్తాబాద్‌ మండలానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, మహేశ్ కుమార్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్‌లను నియమించారు. ఇంఛార్జుల నియామకం ద్వారా పాలక పక్ష దూకుడుకు బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు.

  భట్టి, వీహెచ్:

  రాయిపోలె మండలానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, సీనియర్‌ నేత చంద్రశేఖర్‌, సంజీవ్‌ రెడ్డిలు, చేగుంట మండలానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత వి.హనుమంతురావు, పొన్నం ప్రభాకర్‌, కుసుమకుమార్‌, కేఎల్‌ఆర్‌లను నియమించారు. నర్సింగి మండలానికి పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్‌ షబీర్‌ అలీ, కైలాస్‌ శ్రీనివాస్‌లు, గజ్వేల్‌ మండలానికి మాజీ మంత్రి జె.గీతారెడ్డి, నాయిని యాద్గిరిలను నియమించారు. మొత్తానికి ఈ ఉప ఎన్నికను ఓ మినీ సమరంలా భావిస్తోంది కాంగ్రెస్. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఓటర్లే చెప్పాలి.

  దుబ్బాక ఉపఎన్నిక TRS అభ్యర్థి సుజాత రామలింగారెడ్డి

  జోష్‌లో టీఆర్ఎస్:

  దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి... అధికార టీఆర్ఎస్ జోష్‌లో ఉంది. పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ‘‘సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసం. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాం.’’ అని కేసీఆర్ ప్రకటించారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు