హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka 2020: దుబ్బాక ఎన్నికలు TRS, Congress, BJP లకు కీలకం.. ఎందుకంటే?

Dubbaka 2020: దుబ్బాక ఎన్నికలు TRS, Congress, BJP లకు కీలకం.. ఎందుకంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka ByElection 2020: దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ హోరు ప్రచారం చేశాయి. ఫలితాల ప్రభావం ఏ పార్టీలపై ఎలా ఉండబోతోంది?

  Dubbaka By Poll 2020: గత మూడు నెలలుగా... తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీలు, అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిపోయింది. పండగ వాతావరణం కనిపించింది. రోజూ ఏవో ఒక కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ పార్టీల నేతలు, కార్యకర్తలూ... ఇంటింటి ప్రచారంతో ఎప్పుడూ చూడనంత హంగామా కనిపించింది. జస్ట్ ఒక్క స్థానం కోసం మూడు ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా పోటీ పడ్డాయి. అన్ని పార్టీలూ ఈ ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానికులైతే ఆశ్చర్యపోతున్నారు. "మేం ఎప్పుడూ చూడలేదు... నేతలు వచ్చి మా కాళ్లు పట్టుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ తమకు ఇమ్మంటున్నారు." అని చెబుతూ ఆశ్చర్యపోతున్నారు.

  ఆమధ్య వరకూ దుబ్బాక నియోజకవర్గానికి... 57 ఏళ్ల సోలిపేట రామలింగా రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ నేత. ఆగస్ట్ మొదటి వారంలో గుండె సమస్యతో ఆయన కన్నుమూశారు. దాంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. నవంబర్ 3న ఈ ఎన్నిక జరగనుంది. హై ఓల్టేజ్ ప్రచారం... ఆదివారం సాయంత్రం ముగిసినట్లే.

  మెదక్ జిల్లాలో ఉంది దుబ్బాక. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. సాధారణ ఎన్నికల సమయంలో... దుబ్బాక అసలు ఫోకస్సే అవ్వలేదు. కారణం పక్కనే ఉన్న గజ్వేల్, సిద్ధిపేట బాగా ఫోకస్ అవ్వడమే. గజ్వేల్... సీఎం కేసీఆర్ నియోజకవర్గం. సిద్ధిపేటకు.. టి.హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సీఎంకి మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా. ఇప్పుడు మాత్రం అంతా దుబ్బాక బాట పట్టారు. దాంతో... స్థానికులు ఎప్పుడూ పొందని అనుభవం పొంది... ఒకరకమైన ఆనందంలో ఉన్నారు.

  నేతన్నల కమ్యూనిటీకి చెందిన అనురాధ అనే మహిళ... తన ఇంటికి బయట ఓ చిన్న షాపు నడుపుకుంటోంది. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెను ఉద్యోగాలు లేవంటూ.... ఆవేదన వ్యక్తం చేసింది. "నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువులు పూర్తయ్యాయి. కానీ ఉద్యోగాలు లేవు. చాలా ప్రయత్నించారు కానీ రాలేదు. మేం ఉద్యోగాలు ఇప్పించమని రామలింగారెడ్డిని వేడుకున్నాం. ఉద్యోగాల కోసం లంచం ఇవ్వొద్దని ఆయన చెప్పారు. మేం అది ఫాలో అయ్యాం. ఏమైంది... ఎప్పటికీ ఉద్యోగం రాలేదు" అని ఆమె తెలిపారు.

  మరో చోట ఓ రైతు తన సొంత పొలంలో పనులు చేసుకుంటున్నాడు. అతన్ని కదిలిస్తే... పది పాయింట్లలో కేసీఆర్‌కి 7 పాయింట్లు అనుకూలంగా, 3 వ్యతిరేకంగా చెప్పాడు. కేసీఆర్ తెచ్చిన స్కీమ్స్ రైతు భీమా, రైతు బంధు, బాలికలకు ప్రోత్సాహకాలు, అంబులెన్స్, కేసీఆర్ కిట్ వంటివి ప్రజల్లోకి బాగా వెళ్లాయి. "రైతులం పొలం పనులతో ఎలాగొలా నెట్టుకొస్తున్నాం. మా పిల్లలకు మాత్రం ఉద్యోగాలు లేవు. దొరకట్లేదు. అయినప్పటికీ టీఆర్ఎస్ ఓడిపోదని నేను అనుకుంటున్నాను. వాళ్లు గెలుస్తారు. కాకపోతే... మెజార్టీ అంత రాదు" అని ఆ రైతు తెలిపాడు.

  జర్నలిస్టు నుంచి నేతగా మారిన రామలింగారెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో... టీఆర్ఎస్ తరపున దుబ్బాక నుంచి గెలిచారు. పాతికేళ్లపాటూ జర్నలిస్టుగా చేసిన ఆయన... 2004లో టీఆర్ఎస్‌లో చేరారు. అదే సంవత్సరం దొమ్మాడలో పోటీ చేసి గెలిచారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో అదే నియోజకవర్గం నుంచి ఆయన మళ్లీ గెలిచారు. 2009లో ఆయన దుబ్బాకకు మారారు. అప్పుడు ఓడిపోయారు. 2018లో ఆయన 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌కి చెందిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో, బీజేపీకి చెందిన రఘునందన్ రావు మూడోస్థానంలో నిలిచారు.

  ఇప్పుడు చూస్తే... టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు తీవ్రంగా కనిపిస్తోంది. బీజేపీకి చెందిన అభ్యర్తి రఘునందన్ రావు... ఇదివరకు టీఆర్ఎస్ నేతే. టీడీపీ నేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారనే ఆరోపణలతో... టీఆర్ఎస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. దాంతో ఆయన బీజేపీలో చేరారు. దుబ్బాక నుంచి బరిలో దిగారు.

  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక, అలాగే... కిషన్ రెడ్డి... కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో... దీన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి టీఆర్ఎస్... రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను బరిలో దింపింది. అభివృద్ధితోపాటూ సింపథీ ఓట్లు తమకు దక్కుతాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్... మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు... చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బరిలో దింపింది.

  టీఆర్ఎస్ పాలకులు దుబ్బాకను నిర్లక్ష్యం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపిస్తున్నారు. గత నేత రామలింగారెడ్డిని కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ పట్టించుకోలేదనీ... స్థానిక అధికారులు కూడా సహకరించకపోవడంతో... దుబ్బాకలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన మండిపడ్డారు. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే... తమకు భారీ విజయం దక్కడం ఖాయమని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో దుబ్బాక ఫలితం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నదాన్ని బట్టీ భవిష్యత్తు రాజకీయాలు ఉండనున్నాయి.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana News

  ఉత్తమ కథలు