హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By Poll: బండి సంజయ్ అరెస్టుపై కిషన్ రెడ్డి ఫైర్... రిపోర్ట్ ఇవ్వాలని DGPకి ఆదేశం

Dubbaka By Poll: బండి సంజయ్ అరెస్టుపై కిషన్ రెడ్డి ఫైర్... రిపోర్ట్ ఇవ్వాలని DGPకి ఆదేశం

బండి సంజయ్, కిషన్ రెడ్డి (File)

బండి సంజయ్, కిషన్ రెడ్డి (File)

Dubbaka Election 2020: దుబ్బాక ఉప ఎన్నికపై అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ... నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ముఖ్యంగా నోట్ల కట్టల అంశం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

  Dubbaka By Poll 2020: దుబ్బాక ఉప ఎన్నిక టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ... అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. నిన్నటి నోట్ల కట్టల అంశం మరింత వేడిని రాజేసింది.

  దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సిద్ధిపేటలో జరిగిన ఘటనలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు చెబుతామన్న ఆయన... అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. సిద్ధిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ ఇంటికి గత రాత్రి వెళ్లిన కిషన్‌రెడ్డి... కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సివిల్‌ డ్రెస్సుల్లో పోలీసులు రఘునందన్‌రావు మామ, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారనీ... బీరువాలు, మంచాలు, సూట్‌కేసులు తెరిచి చిందరవందర చేసి దురుసుగా ప్రవర్తించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రఘునందన్‌రావుతోపాటూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై పోలీసులు దాడి చేశారన్న ఆయన... మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌ తరలించారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా... పెద్దఎత్తున డబ్బులు వెదజల్లుతున్నారని, అధికారులను చెప్పుచేతుల్లో ఉంచుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అసలేం జరిగిందో రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీని కోరారు.

  బండి సంజయ్‌తో మాట్లాడిన అమిత్ షా:

  తాజా వివాదంపై కేంద్ర హోమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా... బండి సంజయ్‌కి కాల్ చేసి మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకున్నారు.

  అసలేం జరిగింది?

  సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ రావు ఇళ్లలో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో అంజన్‌ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను అధికారులు గుర్తించారు. అయితే బీజేపీ అభ్యర్థి, అతని బంధువుల ఇళ్లలో పోలీసులే డబ్బులు పెట్టడానికి యత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సోదాలపై సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆ పార్టీ శ్రేణులు అంజన్‌రావు ఇంటికి వెళ్లారు. పోలీసులు, రఘునందన్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో రఘునందన్‌‌రావు సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును లాకెళ్ళుతూ పరుగులు తీశారు కార్యకర్తలు. దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

  బండి సంజయ్ అరెస్టు:

  సిద్ధిపేటలో పోలీసు అధికారుల సోదాల విషయం తెలుసుకుని దుబ్బాకకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో బండి సంజయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయన గట్టిగా కేకలు పెట్టారు. ఆ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్ధిపేటలో సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధి దుబ్బాక నుండే మొదలవుతుందని ఆయన అన్నారు. తనపై దాడి చేసిన పోలీసులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రచారంకు కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా బిజేపీ గెలుపు ఖాయమని సంజయ్ అన్నారు.

  హరీశ్‌రావు ఫైర్:

  సిద్ధిపేటలో బీజేపీ నేతలు చేసిన ఆందోళనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆ పార్టీ నేతలు డబ్బులనే నమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ప్రలోభాలకు గురి చేయాలని యత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలో బీజేపీ నేతల వద్ద డబ్బులు దొరికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సిద్దిపేటలోనూ పోలీసులు రైడ్ చేస్తే పోలీసుల చేతులో నుంచి బీజేపీ నేతలు డబ్బులు గుంజుకుని పారిపోయారని ఆరోపించారు. తప్పు చేయకుంటే సహకరించాలి కానీ ఇలా చేయడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లో సైతం పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు. తన కారు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కారును సైతం పోలీసులు చెక్ చేశారన్నారు. ఓడిపోతున్న ఫస్ట్రేషన్లోనే బీజేపీ నేతలు గొడవ చేస్తున్నారని విమర్శించారు. తాము గెలవబోతున్నామని.. ఈ సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు తమ వైపు ఉన్నారని హరీష్ అన్నారు. కరీంనగర్ నుంచి జనాలను తెచ్చుకుని బీజేపీ నేతలు నామినేషన్ వేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

  ఖండించిన పవన్ కళ్యాణ్:

  బండి సంజయ్ అరెస్టును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండిచారు. ఇదో దుందుడుకు చర్య అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్, బీజేపీ నాయకులపై పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలకు తావిచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వాఖ్యానించారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను అన్ని పార్టీలకు ఒకేలా వర్తింపచేయాలన్నారు. పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థిని, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడం గర్హనీయమన్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు.

  పోలీసుల వెర్షన్ ఇదీ:

  పోలీసు అధికారుల సోదాలపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. నిన్న నమ్మదగిన సమాచారం మేరకు సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు బంధువు సురభి అంజన్ రావు ఇంట్లో సోదాలు చేశామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అంజన్ రావు ఇల్లు కేంద్రంగా ఉదయం నుండి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. దీంతో సిద్ధిపేట అర్బన్ మండల మెజిస్ట్రేట్ విజయ్ సాగర్ తో కలిసి సోదాలు చేశామన్నారు. తనిఖీల్లో సురభి అంజన్ రావు ఇంటిలో రూ. 18. 67 లక్షలు దొరికాయన్నారు. అంజన్ రావును ప్రశ్నించగా తన బావ మరిది జితేందర్ రావు ఎన్నికల కోసం తన డ్రైవర్ ద్వారా డబ్బు పంపించినట్లు చెప్పారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులు, తహసీల్దార్ వస్తుండగా రఘునందన్ రావు, అతని అనుచరులు అడ్డుకున్నారని సీపీ చెప్పారు. ఈ క్రమంలో సురభి అంజన్ రావు ఇంటిలో స్వాధీనం చేసుకున్న డబ్బులలో నుంచి రూ. 5. 87 లక్షలు ఎత్తుకెళ్లారన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారి పై కేసు నమోదు కేసు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. పోలీసు విధులకు, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై సైతం కేసు నమోదు చేశామన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. అంజన్ రావు ఇంటికి వెళ్లినప్పటి నుంచి జరిగిన సోదాలను పూర్తిగా రికార్డు చేశామన్నారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లో కూడా సోదాలు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి ఎవరు భంగం కలిగించినా.. ఓటర్లను డబ్బు తో ప్రలోభాలకు గురి చేయాలని చూసినా.. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Bandi sanjay, Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు