(K.Veeranna,News18,Medak)
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ విచక్షణ మర్చిపోయాడు.. నిబంధనలనకు విరుద్ధంగా మద్యం సేవించి బడికి రావడమే కాకుండా ఆ మత్తులో విద్యార్థులను దారుణంగా హింసించాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభుని పల్లిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై గ్రామస్తులు తిరుగుబాటు చేయగా, విద్యా శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. చివరికి తాగుబోతు టీచర్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటనపై స్థానికులు, అధికారులు చెప్పిన వివరాలివి..
దుబ్బాక మండలం, పద్మనాభునిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఆ స్కూలులో ఎస్జీటీగా పనిచేస్తున్న అమ్మన సంజీవరెడ్డి అనే టీచర్ మద్యానికి బానిసయ్యాడు. పూటుగా మద్యం సేవించి స్కూలుకు రావడం, మత్తులోనే జోగుతూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అలవాటుగా మారింది. గతంలో ఒకటిరెండుసార్లు చెప్పిచూసినా సార్ గారి తీరు మారలేదు. ఈక్రమంలోనే శుక్రవారం నాడు మరోసారి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్.. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు.
తాగుబోతు టీచర్ సంజీవ రెడ్డి నిన్న మద్యం మత్తులో స్కూలుకు వచ్చి, 2, 3, 4, 5 తరగతులకు చెందిన 12 మంది విద్యార్థులను బెత్తంతో చితక బాదాడు. అంతటితో ఆగకుండా పిల్లల చెంపలు, తొడలపై రక్తం వచ్చేలా గోర్లతో గీరాడు. విద్యార్థుల అరుపులు బయ టకు వినపడకుంగా తరగతి గదికి తలుపులు, కిటికీలు వేసి మరి హింసించాడు. స్కూల్ అయిపోయిన తర్వాత..
బాగా కొట్టి గదిలో బంధించిన పిల్లల్ని స్కూల్ ముగిసిన తరువాతగానీ విడిపెట్టలేదు టీచర్ సంజీవరెడ్డి. గాయాలతో ఇళ్లకు పరుగులు తీసిన పిల్లలు.. బడిలో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల ఒండిపై గాయాలు చూసి తల్లడిల్లిన ఊరి జనం.. స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈలోపే విషయం తెలుసుకున్న ఎంఈవో ప్రభుదాస్ అక్కడికి చేరుకున్నారు..
తాగుబోతు టీచర్ సంజీవరెడ్డి చేతిలో గాయ పడిన విద్యార్థులను ఎంఈఓ ప్రభుదాస్, సర్పంచ్ పరామర్శించారు. తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారికి చికిత్స చేయించారు. బాధిత విద్యార్థులు మనోజ్, వర్షిత, సుషాంత్, హరీశ్, ప్రసాద్, రాకేష్, రిత్విక్, హర్షిత్, లోకేష్, నిష్విత, స్పందన, రవళిల నుంచి ఎంఈవో సమాచారం సేకరించారు.
టీచర్ సంజీవ రెడ్డి చాలా కాలంగా మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని, ఆయనను మందలించినా తీరు మార్చుకోలేదని ఎంఈవోకు తల్లిదండ్రులు తెలిపారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆ తర్వాత ఎంఈవో ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లగా తాగుబోతు టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించే టీచర్లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని సిద్దిపేట డీఈవో రవికాంతరావు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dubbaka, Teacher misbehave