గురు పూజోత్సవం రోజున ప్రైవేటు ఉపాధ్యాయులపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) వరాల జల్లు కురిపించారు. గురువుల గొప్పతనం గురించి చాలా చక్కగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. ప్రస్తుతం వారు పడుతున్న కష్టాలను కూడా ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్(Huzurabad) పట్టణంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో (Teachers Day Celebrations) మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీచర్లకు సన్మానం చేశారు. కరోనా కష్టకాలంలోనూ టీచర్లకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 అందరికీ గుర్తు వచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పుజోత్సవమేనని అన్నారు. తల్లిదండ్రుల తరువాత గౌరవం ఇచ్చేది గురువులకు(Teachers) మాత్రమేనని అన్నారు. మనల్ని ఓ స్థాయికి తీసుకొచ్చేది గురువులేనని చెప్పారు. విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదని.. ఉన్నతమైన గౌరవం కోసమని హరీశ్ రావు అన్నారు. గురువులకు ప్రాధన్యత ఇస్తూ.. ఉపాధ్యాయ ఎంఎల్‌సీ అని గురువులను చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నామని చెప్పారు.
ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్(Coronavirsu) ప్రపంచాన్ని గడగడలాడిస్తోందిన అన్నారు. కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడిందన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చు ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువని హరీష్ అన్నారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు(Double Bedroom Houses) ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ టీచర్లను భాగస్వాములను చేస్తామని ఆయన అన్నారు. బ్యాంకులతో మాట్లాడి ప్రైవేట్ స్కూళ్లకు సహాయం అందేలా చూస్తామని భరోసానిచ్చారు.
విద్య ,వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు (Jobs Notifications) రాబోతున్నాయని అన్నారు. 92శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా అరవై వేల ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి.. వాటని త్వరలోనే భర్తీ చేయనున్నట్టుగా వెల్లడించారు.
ఇక, గతేడాది మార్చిలో లాక్‌డౌన్ విధించడంతో.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు (private teachers), ఇతర సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా మారిన సంగతి తెలిసిందే. ఉపాధి కోల్పోవడంతో చాలా మంది కుటుంబ పోషణ కోసం రోడ్లపైకి చేరారు. కొందరు ఉపాధ్యాయులు కూరగాయల దుకాణాలు, చాయ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడం చూశాం. కొందరు కూలీ పనులకు కూడా వెళ్లారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూల్స్ ప్రారంభించిన.. కరోనా కేసులు పెరగడంతో కొద్ది రోజులకే మళ్లీ మూసివేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Double bedroom houses, Harish Rao, Huzurabad, Private teachers, Telangana