హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: గుట్కా వ్యాపారులకు శుభవార్త.. ఇక పోలీసుల వేధింపులు ఉండవు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana: గుట్కా వ్యాపారులకు శుభవార్త.. ఇక పోలీసుల వేధింపులు ఉండవు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana High Court: సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తులపై నిషేధం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ.. పోలీసు అధికారులందరికీ సర్క్యులర్‌ జారీచేయాలని డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  'గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్'.. 'పాన్ మసాలాను తరలిస్తున్న వాహనం సీజ్'.. నిత్యం ఇలాంటి వార్తలను పేపర్లు, టీవీల్లో చూస్తుంటాం. తెలంగాణలో గుట్కా సహా పలు పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉందని.. అందుకే వాటిని అక్రమంగా రవాణా చేసినా.. విక్రయించినా.. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు (Telangana High court) కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో గుట్కా, పాన్‌మసాలా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులపై  (Tobacco  Products)ఎలాంటి నిషేధం అమలులో లేదని స్పష్టం చేసింది. గుట్కా క్రయవిక్రయాలు జరిపే వారిపై కేసు పెట్టే అధికారం పోలీసులకు లేదన తేల్చిచెప్పింది. పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించిందని స్పష్టం చేసింది. అందువల్ల గుట్కా ఉత్పత్తుల తయారీ, సరఫరా, విక్రయదారుల (Gutkha Traders)పై కేసులు పెట్టడానికివీల్లేదని తెలిపింది.

  పొగాకు ఉత్పత్తుల వ్యాపారం చేసే వారిని పోలీసులు వేధిస్తున్నారని.. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి తారానగర్‌కు చెందిన డి. నితేష్ కుమార్‌, మరో ఐదుగురు వ్యాపారులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గుట్కాను సీజ్ చేసే అధికారం లేనప్పటికీ.. పోలీసులు పదేపదే వేధింపులకు పాల్పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లలిత ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున వాదనలను వినిపించిన న్యాయవాదులు.. కోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. గుట్కా, పాన్‌మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్‌ జారీచేసిందని .. ఐతే దానిని సవాల్‌ చేస్తూ శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో మార్చి 31న గుట్కా నిషేధంపై కోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. సుప్రీం స్టే విధించిన నేపథ్యంలో.. తెలంగాణలో పొగాకు ఉత్పత్తుల వ్యాపారంపై ఎలాంటి నిషేధం అమలులో లేదని స్పష్టం చేశారు. తమ వ్యాపారంలో జోక్యం చేసుకునే అధికారం లేనప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని.. సరుకును సీజ్ చేసి, కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు.

  హోంశాఖ తరపున వాదనాలు వినిపించిన న్యాయవాది.. గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం మరికొంత సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఐతే ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలే చెప్పారని.. మళ్లీ అదే వాదన వినిపించడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం సైతం పార్టీగా ఉందనివ్యాఖ్యానించింది. కేసులు పెట్టిన ప్రతి పోలీసు అధికారి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలంటే సమయం సరిపోదని.. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసు అధికారులంతా పాటించేలా ఆదేశాలు జారీచేయాలని స్పష్టం చేసింది. పోలీసులు తమను వేధించకుండా చర్యలు తీసుకోవాలని.. జర్దా, పాన్‌మసాలా ఉత్పత్తి, వ్యాపారుల సంక్షేమ సంఘం డీజీపీకి వినతి పత్రం కూడా అందజేసిందని కోర్టు గుర్తుచేసింది. ఐనప్పటికీ పోలీసులు కేసులు పెడుతున్నారని.. కోర్టు ఆదేశాల అమలులో హోంశాఖ తీవ్రంగా విఫలమైందని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తులపై నిషేధం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ.. పోలీసు అధికారులందరికీ సర్క్యులర్‌ జారీచేయాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. రెండు రోజుల్లో దీనిని జారీచేయని పక్షంలో.. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Hyderabad police, Telangana, Telangana Police

  ఉత్తమ కథలు