శ్రీరామ నవమిపై కరోనా ఆంక్షలు.. భద్రాద్రికి భక్తులు ఎవరూ రావొద్దు.. మంత్రి విజ్ఞప్తి

ప్రతీకాత్మక చిత్రం

దయచేసి భక్తులెవరూ భద్రాచలం రావొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాములోరి కల్యాణం కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామని చెప్పారు.

 • Share this:
  తెలంగాణలోని భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. కానీ కరోనా కారణంగా గత ఏడాది నిరాడంబరంగా నిర్వహించారు. కనీసం ఈసారైనా రాములోరి కల్యాణాన్ని కళ్లారా వీక్షించాలని భక్తులు అనుకున్నారు. కానీ మార్చిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ, ఉగాది, శ్రీరామనవమితో పాటు అన్ని పండుగలపైనా ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలపైనా దేవాదాయశాఖ క్లారిటీనిచ్చింది. గత ఏడాది లాగే ఈసారి కూడా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

  శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణపై ఆదివారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్‌.. దేవాదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్.. భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని ఈసారి కూడా నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరిమిత సంఖ్యలో భక్తులతో మాత్రమే వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

  దయచేసి భక్తులెవరూ భద్రాచలం రావొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాములోరి కల్యాణం కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో భద్రాలచం ఆలయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. కోవిడ్ నిబంధనలను అనుగుణంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంగణాలను శానిటైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారాముల కల్యాణాన్ని ఎప్పటిలాగే టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంచేస్తామని.. భక్తులు ఇళ్లల్లోనే ఉండి వీక్షించవచ్చని తెలిపారు.

  భక్తులకు స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదం:

  కాగా, రాబోయే అన్ని మతాల పర్వదినాలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్, గుడ్‌ఫ్రైడే వేడుకలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీచేసింది. శోభాయాత్రలు, ర్యాలీలు, ప్రజలు గుంపులుగా తిరగడంపై నిషేధం విధించింది. తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు భారీ ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరూ ఇళ్లల్లోనే ఉండి పండగలు జరుపుకోవాలని సూచించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని.. లేదంటే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
  Published by:Shiva Kumar Addula
  First published: