యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు.. ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు..

ప్రతీకాత్మక చిత్రం

ఎవరైనా చిన్న పిల్లలు మట్టి లేదంటే బలపాలు తింటారు. కాని ఆ యువతి వెంట్రుకలను తింటుంది. ఒకటి రెండు సంవత్సరాలు కాదు. ఏకంగా ఇరయ్యేళ్ళ నుండి ఇదే అలవాటు.ఇది ఎక్కడో అమెరికాలోనో.. ఆఫ్రికాలోనో కాదు.. మన రాష్ట్రంలోనే జరిగింది తెలుసా.

  • News18
  • Last Updated :
  • Share this:
    ఎవరైనా చిన్న పిల్లలు మట్టి లేదంటే బలపాలు తింటారు. కాని ఆ యువతి వెంట్రుకలను తింటుంది. ఒకటి రెండు సంవత్సరాలు కాదు. ఏకంగా ఇరయ్యేళ్ళ నుండి ఇదే అలవాటు. ఇటీవల విపరీతంగా కడుపునొప్పితో బాధపడటంతోపాటు వాంతులు చేసుకుంటూండటంతో వైద్యున్ని సంప్రదించారు. అన్నీ పరీక్షలు చేసిన ఆ వైద్యుడు ఆ యువతికి శస్త్ర చికిత్స చేసి కడుపులో నుండి రెండున్నర కిలో వెంట్రుకలను బయటకు తీయడంతో అందరూ నివ్వెరపోయారు. ఇది ఎక్కడో అమెరికాలోనో.. ఆఫ్రికాలోనో కాదు.. మన రాష్ట్రంలోనే జరిగింది తెలుసా. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    అసలు విషయానికి వస్తే.. నిర్మల్ పట్టణానికి చెందిన 22 ఏళ్ళ ఓ యువతి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ యువతికి మానసికంగా ఎదుగుదల సరిగా లేకపోవడం వల్ల తన ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులకు ఆ యువతి వివరించలేకపోయేది. కుటుంబ సభ్యులు సాధారణ సమస్యేనని భావించారు. అయితే గత పదిహేను రోజులుగా ఆ యువతి ఏం తిన్నా, తాగినా వాంతులవుతుండటం తో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కొద్దిరోజులు ఆసుపత్రిలో ఉంచారు. స్కానింగ్ తో పాటు ఇతర పరీక్షలు జరిపారు. ఎలాంటి రోగ లక్షణాలు గుర్తించకపోవటం వల్ల ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చాక మళ్లీ పరిస్థితి ఎప్పటిలా మారింది. రోజురోజుకీ ఆరోగ్యం క్షిణిస్తుండటాన్ని చూసి పట్టణంలోని ప్రశాంత్ జీకే అసుపత్రికి యువతిని తరలించారు.

    బాధిత యువతి తల్లిదండ్రులతో మాట్లాడిన అక్కడి వైద్యుడు యువతి రోజువారీ అలవాట్లు, అనారోగ్య లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానంతో ఎండోస్కోపి నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఆ బాధితురాలి చిన్నపేగులో వెంట్రుకలున్నట్లుగా గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించగా తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. దీంతో వైద్యులు ఆమె కడుపులోని చిన్న ప్రేగులో పోగైన వెంట్రుకల ముద్దను గ్యాస్టరస్టమి విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి బయటకు తీశారు.

    ఇలా బయటపడ్డ వెంట్రుకలు దాదాపు 150 సెం.మీ పొడవుతో, రెండున్నర కిలోలకు పైగా బరువున్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం బాధితురాలి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఒక మనిషి కడుపు నుండి రెండున్నర కిలోల వెంట్రుకలు బయటపడటం అరుదైన విషయమని వైద్యులు పేర్కొన్నారు. సాధారణంగా మానసిక స్థితి సరిగా లేని వారిలో వెంట్రుకలు తినే అలవాటుంటుందని, అయితే ఇంత మొత్తం పోగవడమనేది చాలా అరుదని వైద్యులు వివరించారు.
    Published by:Srinivas Munigala
    First published: