Covid 19: ఖమ్మంలో దారుణం.. పుట్టిన రోజు నాడే ఇలా.. చచ్చినా వదల్లేదు..

ప్రతీకాత్మక చిత్రం

Covid 19: కరోనా మహమ్మారి బారిన పడి వేలాది మంది ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో.. ప్రాణాలు నిలబెట్టాల్సిన వైద్యులు సొమ్ము చేసుకోడానికే మొగ్గు చూపుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి చనిపోయాడిని నిర్దారించుకొని డెడ్ బాడీ ఇవ్వాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బలు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఎదో రకంగా డెడ్ బాడీ తీసుకొస్తే.. అంత్యక్రియలు చేసే మున్సిపల్ సిబ్బందికి ముడుపులు చెల్లించాల్సి వస్తోంది.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్‌18 తెలుగు)

  ఒకవైపు ప్రభుత్వాసుపత్రిలో బెడ్‌లు దొరక్క.. ప్రవేటు వైద్యశాలలకు వెళ్తే అక్కడ బిల్లుల మోత మోగుతోంది. కనీసం మూడు నాలుగు లక్షలు ఖర్చు కాకుండా కోవిడ్‌ బాధితుడు బయటపడే పరిస్థితి లేదు. అయినా ప్రాణాలు దక్కితే చాలన్నట్టుగా పరిస్థితి ఉంది. దీంతో కాస్తో కూస్తో తాహతు ఉన్నవాళ్లు వైద్యం పొందుతుండగా.. ఇక బీద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు దేవుడిపైనే భారం వేసి ప్రాణాలు ఉగ్గపట్టి రోజులు లెక్కబెడుతున్నారు. ఇక ప్రవేటు వైద్యుల ధనదాహం ముందు మానవత్వం వెక్కిరింతకు గురవుతోంది. కనీసం సాటి మనిషన్న సోయి కూడా లేకుండా డబ్బు చెల్లించకపోతే వైద్యం నిలిపేస్తుండడం.. ఇంకాస్త ముందుకెళ్లి వేసినమేరకు ఆసుపత్రి బిల్లు చెల్లించలేదన్న సాకుతో మృతదేహాన్ని కూడా ఇవ్వకుండా బాధిత కుటుంబానికి తీరని వేదనను మిగుల్చుతున్నారు. ఇటీవల ఖమ్మంలోని ఆ ప్రవేటు ఆసుపత్రి నిర్వాకం మానవత్వానికి మచ్చలా నిలిచింది. పాపం ఆ అభాగ్యుడు పుట్టినరోజునాడే కరోనాతో ప్రాణాలు పోగొట్టుకోవడం ఇక్కడ మరో విషాదం.

  ఆ కరోనా బాధితుడిది ఏపీలోని కృష్ణా జిల్లా. ఖమ్మం పట్టణానికి దగ్గరిలోని ఓ పల్లెటూరు. నిరుపేద కుటుంబం. లక్షణాలు కనిపించగానే ఖమ్మం చేరుకుని టెస్ట్‌లు చేయించాడు. పాజిటివ్‌ అని తేలడంతో ప్రభుత్వాసుపత్రిలో చేరడానికి ప్రయత్నం చేశాడు. బెడ్‌ దొరకలేదు. దీంతో భయానికి లోనైన ఆ యువకుడు ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజుల పాటు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. సోమవారం ఉదయం మృతిచెందాడు. పేషెంట్‌గా అతను అడ్మిట్‌ అయ్యే సమయంలో రూ.30 వేలు.. మరోసారి రూ.20 వేలు చెల్లించారు. ఇక అతను చనిపోయినట్టు నిర్ధారించుకున్న అనంతరం మొత్తం రూ.లక్ష బిల్లు అయినట్టు.. అప్పటికే చెల్లించిన రూ.50 వేలు పోను.. మిగిలిన రూ.50 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో తాము అంతమొత్తం చెల్లించుకోలేమని.. తాము పేదవాళ్లమని అతని భార్య వేడుకున్నా ఫలితం దక్కలేదు. కరోనా కావడంతో బంధువులు, స్నేహితులు ఎవరూ రాలేదని మొత్తుకున్నా వినలేదు. ఎన్ని చెప్పినా.. ఎన్ని గంటలసేపు బతిమాలినా ఆసుపత్రి యాజమాన్యం డబ్బు చెల్లిస్తేనే డెడ్‌బాడీని ఇస్తామని ఖరాఖండిగా చెప్పేయడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆమె ఇంటికెళ్లిపోయింది.

  అయితే ఈ విషయం ఖమ్మంలో నివాసం ఉండే మృతుని బంధువుకు తెలిసి.. రాత్రి దాకా ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి మొత్తానికి డెడ్‌బాడీని బయటకు తెచ్చారు. ఇక ఇక్కడ రెండో రకం వ్యాపారం మొదలైంది. కరోనాతో మృతిచెందిన డెడ్‌బాడీకి తాము అంత్యక్రియలు చేయలేమని తొలుత మొండికేసి.. ఆనక రూ.20 వేలు తీసుకుని పనికానిచ్చారు. ఇలా చనిపోయిన వ్యక్తి డెడ్‌బాడీని కనీసం కట్టుకున్న భార్యకు కూడా ఇవ్వకుండా ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యం దాదాపు ఎనిమిది గంటలపాటు అట్టిపెట్టుకోగా.. ఇక ఎవరూ లేని డెడ్‌బాడీలకు అంతిమ సంస్కారం చేయాల్సిన మున్సిపల్‌ సిబ్బంది సైతం ఆ పేద కుటుంబం వద్ద ఇరవై వేలకు కక్కుర్తి పడడం మానవత్వానికి మచ్చగా మారింది. దీంతో కరోనా పాజిటివ్‌ వచ్చిన పేషెంట్లు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మేమున్నామంటూ భరోసా ఇస్తున్నా.. ప్రవేటు ఆసుపత్రుల దందా తగ్గడం లేదు.. సిబ్బంది దోపిడీ ఆగడం లేదు.
  Published by:Veera Babu
  First published: