Telangana: స్మశానంలో దీపావళి సంబరాలు.. జాతరను తలపించే వేడుకలు

సమాధుల దగ్గర దీపావళి వేడుకలు

Karimnagar: ఏటా కరీంనగర్ కార్ఖహన గడ్డ సమాధుల వద్ద దీపావళి రోజున ఈ రకమైన జాతర వాతావరణం కనిపిస్తుంది.

 • Share this:
  వినడానికి విడ్డురంగా ఉన్నా.. కరీంనగర్‌లో ప్రతి యేటా ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చనిపోయిన తమ పెద్దలను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల దగ్గర చేసే ఈ రకమైన పూజలు జాతరను తలపిస్తాయి. దీపావళి రోజున జరిగే ఈ సంబరాలకు ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. సాధారణంగా దీపావళి వేడుకలకు అందరూ దేవుళ్ళను పుజిస్తారు. కానీ కొన్ని సామాజికవర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తుంటాయి. చనిపోయిన తమ తమ పూర్వికులను, పెద్దలను గుర్తుచేసుకుంటారు. పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే.. వీళ్లు మాత్రం సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి వేడుకలను జరుపుకుంటారు.

  ఏటా కరీంనగర్ కార్ఖహన గడ్డ సమాధుల వద్ద దీపావళి రోజున ఈ రకమైన జాతర వాతావరణం కనిపిస్తుంది. ఈ వేడుకల కోసం ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది లైటింగ్స్, త్రాగునీటిని ఏర్పాట్లు చేశారు. పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటికల వద్ద అంత శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. దీపావళి రోజున వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ వేడుకలకు దూర ప్రాంతంలో ఉన్న బంధువులు కూడా వస్తుంటారు. పూజా కార్యక్రమాలు అయిపోయిన తరువాత అక్కడే సమాధుల వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటారు.

  వారి జీవితంలోని అపురూప ఘట్టాలను పిల్లలకు వివరిస్తారు. ఈ సమాధుల పండుగ తమకు దేవుళ్ళ పండగ లాంటిదని చెబుతుంటారు. కొత్త బట్టలు వేసుకొని పిల్ల పాపలతో సాయంత్రం ఆరుగంటలకు సమాధుల వద్దకు వచ్చి ఇక్కడే రెండు గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వికులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు. ఈ ఆచారం వందల సంవత్సరాల నుంచి వస్తోంది. కరోనా నేపథ్యంలో ఈసారి జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేసినట్టు కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు.
  Published by:Kishore Akkaladevi
  First published: