తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్రభుత్వం ప్రసూతి మహిళ ఆమెకు పుట్టిన బిడ్డ ఆరోగ్య కోసం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం అమలు విషయంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రు(Government Hospital)ల్లో ప్రసవించిన మహిళకు కేసీఆర్ కిట్(Kcr kit)తో పాటు ఆడపిల్ల పుడితే 13వేలు , మగపిల్లవాడు పుడితే 12 వేల నగదును నాలుగు విడతలుగా బ్యాంక్ అకౌంట్(Account)లో జమ చేసేవారు. అయితే ఇది గతంలో జరిగిన ముచ్చట. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు అర్హులైన మహిళలు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినప్పటికి ప్రస్తుతం కిట్ల పంపిణీ మాత్రమే జరుగుతోందని...నగదు పంపిణి (Cash distribution)చేయడం లేదని తెలంగాణలోని చాలా జిల్లాల నుంచి వినిపిస్తున్న మాట.
మసకబారుతున్న ప్రతిష్టాత్మక పథకం..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సంవత్సర కాలంలో కేసీఆర్ కిట్ నగదు జమ కావడం లేదంటుంటే మరికొన్ని జిల్లాల్లో ఏడాదిన్నర కాలంగా తమకు ఈ పథకం కింద డబ్బుల పంపిణి నిలిచిపోయిందంటున్నారు. గర్భిణి ప్రసవించిన సమయంలో ఫస్ట్ యాంటి నాటల్ చెకప్ నుంచి బిడ్డ పుట్టిన 9 నెలల్లోపు వైద్యం, పౌష్టికాహారం కోసం తీసుకోవాల్సిన పదార్ధార కోసం సర్కారు నగదు ఇచ్చేది. అర్హులైన తల్లుల బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులను జమ చేసేది. గత ఏడాది నుంచి ఈ కేసీఆర్ కిట్ నగదు అందకపోవడంతో దాదాపు నాలుగున్నర లక్షల మంది తల్లులు డబ్బులు ఎప్పుడు జమా అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం చూసుకుంటే ఈపథకం ద్వారా 550కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేయకుండా నిలిపివేసిందని అధికారులే చెబుతున్న మాట.
ప్రసూతి మహిళల ఎదురుచూపు..
సర్కారు దవఖానాలో ప్రసవం, తల్లీ, బిడ్డలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నప్పుడు బాలింత మహిళలకు డబ్బులు పంపిణి చేయాల్సిన అవసరం ఏముందన్నది ప్రభుత్వ అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. వారి మాటలను బట్టి చూసుకుంటే కేసీఆర్ కిట్ స్కీమ్ ఇకపై నగదు పంపిణి జరగదనే సంకేతం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం కిట్‌లు మాత్రమే అందజేస్తామని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది.
ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలిగా..
ప్రభుత్వం కేసీఆర్ కిట్ నిధుల్ని విడుదల చేయకపోవడంతో ఆ పథకం అమలు, తీరు తెన్నులు పరిశీలిస్తున్న హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎందుకంటే గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసేది వాళ్లే కావడంతో ..డబ్బులు పంపిణి జరగకపోవడంతో వాళ్లనే నిలదిస్తూన్న పరిస్థితి ఉంది. మాకు ఎందుకు డబ్బులు జమ కాలేదు..ఏదైనా పొరపాటుగా ఎంటర్ చేశారా అని కొందరు ప్రశ్నిస్తుంటే ...కొన్నిచోట్ల ఆశా వర్కర్లే తమకు కేసీఆర్ కిట్ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే ఈ పథకం కిట్‌ల పంపిణి వరకే పరిమితమా లేక నగదు జమ చేస్తారా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు మాకీ తిప్పలు తప్పవంటున్నారు అర్హులైన ఆడబిడ్డలు, అమ్మలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Schemes, Telangana Government