(లెనిన్, న్యూస్ 18, ఆదిలాబాద్)
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కమలం పార్టీ (BJP)లో కలకలం రేగింది. ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. వారి తీరు పోలీసు స్టేషన్ లో కేసుల వరకు వెళ్లింది. తాజాగా ఓ భూ వివాదం (Land issues) జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే జిల్లాలో ఈ పార్టీ ఇప్పుడిప్పుడే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఈ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. అయితే గత ఎన్నికల్లో ఆదివాసి గిరిజన నాయకుడు సోయం బాపురావు ఎంపీగా గెలవడంతో పార్టీకి బలం పెరిగినట్లైంది. అయితే ఇటీవల పార్టీ నేతల్లో నెలకొన్న వర్గ విభేదాలు , ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, భూ వివాదానికి సంబంధించి చేసుకున్న కొన్ని సంఘటనలు పార్టీకి చెడ్డపేరు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా ఎంపీ సోయం బాపురావు ఇంటి వద్ద నెలకొన్న ఘటన సొంత పార్టీ నేతల పైన పోలీసు కేసులు పెట్టే వరకు వెళ్ళిందంటే నాయకుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఏ స్థాయికి చేరాయో తెలుస్తోంది.
భూ వివాదానికి సంబంధించి..
ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ల మధ్య నెలకొన్న వర్గ విభేదాలతో(Disputes) పార్టీ రెండుగా చీలిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహించడం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. తాజాగా ఇచ్చోడ మండలంలోని ఓ భూ వివాదానికి సంబంధించిన సంఘటన విషయంలో గత రోజుల క్రితం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర తనయుడు పాయల్ శరత్ తో పాటు మరికొందరు రాత్రి సమయంలో ఎంపీ ఇంటి వద్దకు వెళ్లగా, ఎంపీ విశ్రాంతి తీసుకుంటున్నారని గన్ మెన్ లు వారికి చెప్పారు. అయినా ఎంపీని తాము కలవాల్సిందేనన్నారు. అయితే లోక ప్రవీణ్ రెడ్డి తమ విధులకు ఆటంకం కల్పిస్తూ తమను దూసుకుంటూ ఇంట్లోకి వెళ్లారని గన్ మెన్ లు మావల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత పార్టీ నాయకుని పైన ఇలా కేసు నమోదు చేయడం చూస్తే పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు చెప్పకనే చెబుతున్నాయి.
డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు..
ఇదిలా ఉంటే బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పార్టీని ఎంత బలోపేతం చేశారో అందరికి తెలిసిందే. గతంలో ఉన్న బీజేపీకి, ప్రస్తుత బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు చర్చించుకొంటున్న నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు పాయల్ శంకర్ ను వెంటడుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నూ అధికార పార్టీ నేతల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి నుంచి ఎంపీ సోయం బాపూరావు, పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ల మధ్య విభేదాలు నెలకొన్నాయి.
తాజాగా జైనథ్ మండలం మహిళా ఎస్సై పట్ల పాయల్ శంకర్ అసభ్యంగా మాట్లాడారని పలు ప్రాంతల్లో మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. గత రెండు రోజుల కిందట భూ వివాదం విషయంలో శంకర్ అనుచరులు ఎంపీ సోయం ఇంటి వద్దకు వెళ్ళి గొడవ చేసిన సంఘటన కూడా శంకర్ కు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఇలా వరుస ఘటనలతో పాయల్ శంకర్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అయితే గతం కంటే ప్రస్తుతం పార్టీ బలోపేతం అవుతోందన్న సంతోషం కంటే నాయకుల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు బిజెపి పార్టీ ద్వితీయశ్రేణి నాయకులను, కార్యకర్తలను ఆగమ్య గోచరంలోకి నెట్టుతోంది.
ఇప్పటికే పార్టీలో సోయం బాబురావు, పాయల్ శంకర్, సుహాసిని రెడ్డి నేతల మధ్య నెలకొన్న మనస్పర్థలతో పార్టీ పరిస్థితి ఎటువైపు దారి తీస్తోందనే ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. పార్టీ బలోపేతం అవుతుందన్న సంతోషం కంటే, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు, వరుస ఘటనలతో పార్టీ మళ్ళీ గతంలో మాదిరిగానే మరిపోతుందేమో ననే భయం ద్వితీయశ్రేణి నాయకులను నిరాశకు గురి చేస్తోంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ దూకుడు మీదుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతల వ్యవహార శైలితో చతికిలపడిపోయే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉంటే ఈ అవకాశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. భూ వివాదానికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో విచ్చలవిడిగా భూ మాఫియాను కొనసాగిస్తూ బీజేపీ అధ్యక్షుడు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడితోపాటు ఆయన అనుచరులపై రౌడి షీట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Telangana bjp, Telangana Politics