దిశా కేసు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేగాక పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. దిశాను చంపేసిన తగులబెట్టిన చోటే నలుగురు రేపిస్టులు చనిపోయారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నలుగురి మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది.
దిశ హత్య కేసు నిందితులను బుధవారం పోలీస్ కస్టడీకి షాద్ నగర్ కోర్టు అనుమతిచ్చింది. అనంతరం చర్లపల్లి జైలు నుంచి నిందితులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. గురువారం విచారణ చేశారు. శంషాబాద్‌లోని తొండుపల్లి గేట్ సమీపంలో దిశాను హత్యాచారం చేసిన చోటుకు తీసుకెళ్లి.. వివరాలు సేకరించారు. రేప్ చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో పాతిపెట్టిన దిశా సెల్‌ఫోను స్వాధీనం చేసుకొన్నారు.
నవంబరు 28న రాత్రి శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో లారీలపై పని చేసే నలుగురు వ్యక్తులు దిశాను అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి వద్ద తగులబెట్టారు. ఈ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని అందరూ డిమాండ్ చేస్తున్న సమయంలోనే.. వారిని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.