Dharani: రైతులకు ఊరట.. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునళ్లు ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయి మ్యుటేషన్లు కాని వారికివారం రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సమస్యల పరిష్కారానికి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

  • Share this:
    ధరణి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన పనిలేకుండా.. ధరణిని తీర్చిదిద్దారు. అందులో భాగంగా తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో జిల్లా ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేశారు. ఐతే వాటి సేవలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్ సభ్యులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమయం కేటాయిస్తున్నారు. రోజుకు రెండు మండలాల చొప్పున ఎంపిక చేసి.. పెండింగ్‌లో ఉన్న వివాదాల్లోని భూ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. తగిన ఆధారాలతో ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సిందిగా సూచిస్తున్నారు.

    ఆయా కేసులను విచారిస్తున్న కలెక్టర్లు.. అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు జిల్లాకు ఇద్దరు తహసీల్దార్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లను నియమించారు. వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్లకు ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో పక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికైనా వివాదాలకు చెక్ పడుతుందని ఎదురుచూస్తున్నారు.

    ఇక సీఎం కేసీఆర్ సూచనల మేరకు ధరణి పోర్టల్‌‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేశారు అధికారు. కొన్ని కొత్త ఆప్షన్‌లను తీసుకొచ్చారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయి మ్యుటేషన్లు కాని వారికివారం రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సమస్యల పరిష్కారానికి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ముందుగా కలెక్టర్‌కు దరఖాస్తు చేయాలి. ఆ తర్వాతే ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షలకు పైగా పెండింగ్‌ మ్యుటేషన్లు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో తహసీల్దారుకు రోజుకు కనీసం పది పెండింగ్‌ మ్యుటేషన్ల సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా 30 స్లాట్లు అందుబాటులోకి తెచ్చారు.
    Published by:Shiva Kumar Addula
    First published: