విధి ఆ కుటుంబంతో ఆటలాడుకుంది. ఇంట్లో పెద్దమనిషి చనిపోయిన కొద్దిరోజులకే మరో వ్యక్తిని బలి తీసుకుంది. తాత అస్థికలను కలిపేందుకని కృష్ణా నదికి వెళ్లిన మనవడిని మృత్యువు పలకరించింది. ఆస్థికలను కలిపిన అనంతరం నదిలో స్నానం చేస్తుండగా అక్కడే మునిగిపోతున్న చిన్నారిని కాపాడే ప్రయత్నంలో మనవడు వరదలో కొట్టుకుపోయారు. అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నదిలో కనిపించలేదు. గమనించిన కుటుంబసభ్యులు, పోలీసులు జలార్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. అప్పటికే యువకుడు తనువు చాలించాడు. చేతికి అందొచ్చిన కొడుకు అలా మృత్యువాత పడటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తాత అస్థికలను కలిపిన రోజే ఇంట్లో మనవడు మృతిచెందడంతో అందరూ దుఃఖ సాగరంలో మునిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఇటిక్యాల మండలం బీచ్ పల్లి వద్ద చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన కార్తీక్ (24) తాత ఇటీవలె మృతిచెందారు. అయితే ఆయన అస్థికలను నిమజ్జనం చేసేందుకు కార్తిక్‌తో పాటు కుటుంబసభ్యులు, బంధువులు మరో 20 మంది వరకు ఇటిక్యాల మండలం జాతీయ రహదారిపై ఉన్న బీచ్ పల్లి వద్ద కృష్ణా నదికి వచ్చారు. అక్కడే సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి తన తాత అస్థికలను కృష్ణా నది నీటిలో కలిపారు. అనంతరం కార్తిక్ కుటుంబ సభ్యులంతా నదిలో స్నానాలు ఆచరించారు. అయితే ఆ సమయంలో నదిలో వరద ఉధృతి కూడా ఎక్కవే ఉంది. కాగా, అదే సమయంలో స్నానానికి వెళ్లిన కార్తీక్ కుమార్తె స్వీటీ ఒక్కసారిగా కృష్ణా నదిలో మునుగుతూ కనిపించింది. దీంతో స్వీటీని రక్షించేందుకు కార్తిక్ లోపలికి వెళ్లాడు. ఆమెను సమీపించేలోగా కార్తిక్ కూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో కార్తిక్, స్వీటీ ఇద్దరూ నీటిలో కనిపించలేదు. వరదలో కొట్టుకుపోయారు. అది గుర్తించిన నలుగురు కుటుంబసభ్యులు వారిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన అక్కడున్న పోలీసులు, జాలర్లు వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. స్వీటీ ప్రాణాలతో బయటపడింది.
వరద ఎక్కువగా ఉండటంతో కార్తీక్ కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. కొద్దిసేపటికే జాలర్లు అతడిని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. కానీ, నదిలో మునగడంతో కార్తిక్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. దీంతో అతడిని హుటాహుటిన కుటుంబసభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే కార్తీక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఎస్ ఐ సత్యనారాయణ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Died, Krishna River, Mahabubnagar, Telangana