లాక్‌డౌన్ వేళ కరెంటు కష్టాలా.. అయితే ఈ యాప్‌తో చెక్.. త్వరలోనే..

ప్రతీకాత్మక చిత్రం

సర్వీస్ నంబర్, మీటర్ రీడింగ్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి. అలా చేస్తే వెంటనే వినియోగదారుల విద్యుత్ బిల్లు ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది. ఆ బిల్లును అదే యాప్‌లో సైతం చెల్లించే వెసులుబాటు ఉంది.

 • Share this:
  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ నిబంధనల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్క ప్రజలకే కాకుండా పలు సంస్థలకు సైతం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందులోనూ అత్యవసర సేవల కింద ఉండే విద్యుత్ శాఖకు అదే పరిస్థితి. ఎందుకంటే.. లాక్‌డౌన్ వల్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యుత్ సంస్థలు మనుగడ కష్టం అవుతోంది. దీన్ని అధిగమించేందుకు ఓ సరికొత్త మొబైల్ యాప్‌ను విద్యుత్ సంస్థలు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్పీడీసీఎల్(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు సర్వీస్ నంబర్, మీటర్ రీడింగ్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి.

  అలా చేస్తే వెంటనే వినియోగదారుల విద్యుత్ బిల్లు ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది. ఆ బిల్లును అదే యాప్‌లో సైతం చెల్లించే వెసులుబాటు ఉంది. యాప్‌నకు సంబంధించి అన్నీ టెస్ట్‌లు పూర్తయ్యాయి. ఈఆర్సీ ఆమోదం కోసం పంపారు. ఒక్కసారి ఆమోదం వచ్చాక.. పూర్తిస్థాయిలో యాప్‌ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ ఎండీ గోపాల్ రావు న్యూస్ 18తో చెప్పారు. తెలంగాణ ట్రాన్స్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ‘సాధారణ రోజుల్లో విద్యుత్ సంస్థలకు నెలకు రూ.2వేల కోట్లు బిల్లుల రూపంలో సమకూరుతాయి. కానీ లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు రూ.780 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.’అని చెప్పారు.

  ఎన్పీడీసీఎల్ తయారు చేసిన యాప్ విజయవంతమైతే.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదిలావుంటే.. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు ఇలాంటి ప్రక్రియకు గతంలోనే శ్రీకారం చుట్టింది. వినియోగదారుడు మీటర్ రీడింగ్ ఫోటో తీసి ఆన్ లైన్‌లో పంపితే దానికి అనుగుణంగా బిల్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన బిల్లు మళ్లీ ఆన్ లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేసిన వినియోగదారులకు అక్కడి విద్యుత్ సంస్థలు బిల్లులో కొంత రాయితీ కూడా ఇస్తున్నాయి.
  Published by:Narsimha Badhini
  First published: