హోమ్ /వార్తలు /తెలంగాణ /

Delhi Liquor Scam: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి.. చార్టర్డ్ ఫ్లైట్స్‌లో డబ్బు.. లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం

Delhi Liquor Scam: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి.. చార్టర్డ్ ఫ్లైట్స్‌లో డబ్బు.. లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi Liquor Scam: శరత్‌ చంద్రా రెడ్డి భార్య కనికకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నేతలతోపాటు, ఢిల్లీ స్థాయిలోనూ కీలక నాయకులతో పరిచయాలు ఉన్నట్లు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో లింకులు బయటపడ్డాయి. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా మరో లింకు బయటపడింది. ఈ కుంభకోణంలో అక్రమ డబ్బును హవాలా మార్గంతో పాటు వాయు మార్గంలో కూడా ఢిల్లీకి తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలిందట. హైదరాబాద్ (Hyderabad) నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్‌లో ఢిల్లీ(New Delhi)కి తరలించేవారట. దీని వెనక కీలక సూత్రధాని ఎవరో తెలుసా..? ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి భార్య, జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు కనికా టెక్రివాల్‌ రెడ్డి అని ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. ఆమె జెట్ సెట్‌గో పేరుతో విమాన సర్వీసులు అందిస్తోంది. ఆ చార్టర్డ్‌ విమానాల్లోనే బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు నగదును తరలించారని సమాచారం. దీనిపై ఈడీ అధికారులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

ఇతర విమానాశ్రాయాలతో పోల్చితే.. బేగంపేట ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ తక్కువగానే ఉంటుంది. స్క్రీనింగ్ పాయింట్లు కూడా ఉండవు. చార్టర్డ్ ఫ్లైట్లలో వెళ్లే వీఐపీల వాహనాలు నేరుగా రన్‌వేపై విమానాల దగ్గరి దాకా వెళ్లేందుకు వీలుటుంది. ఈ వెసులుబాటును వాడుకొని లిక్కర్ స్కామ్ కోసం డబ్బులను విమానాల్లో తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బేగంపేట నుంచి జెట్ సెట్‌గో విమానాల రాకపోకల వివరాలపై ఈడీ ఆరా తీసింది. ఆధారాలు ఇవ్వాల్సిందిగా... ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI)కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ రాబిన్‌ గుప్తా గత నెల 17న లేఖ రాశారు. దేశంలో ప్రైవేటు జెట్‌చార్టర్డ్‌ సేవలు అందిస్తున్న జెట్‌సెట్‌ గో ఏవియేషన్‌ సర్వీసెస్‌ సంస్థకు చెందిన డాక్యుమెంట్లు, సమాచారం అత్యవసరంగా కావాలని అందులో కోరారు. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ సంస్థ విమానాల ఆపరేషన్స్, అందులో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. AAI వెంటనే రంగంలోకి దిగి.. అన్ని వివరాలను సేకరించి.. మరుసటి రోజే ఈడీకి అందజేసినట్లు తెలిసింది.

శరత్‌ చంద్రా రెడ్డి భార్య కనికకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నేతలతోపాటు, ఢిల్లీ స్థాయిలోనూ కీలక నాయకులతో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. చాలా మంది రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వారి అండతోనే బేగంపేట విమానాశ్రయం నుంచి విమానాల్లో నగదును తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ , ఏపీకి చెందిన మరింత మంది రాజకీయ నేతల పాత్రపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ప్రైవేట్ చార్టర్డ్ విమానాల లింకులు బయటపడడంతో ఏఏఐ అప్రమత్తమైంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రైవేటు చార్టర్డ్‌ విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రొటోకాల్‌ కలిగిన వీవీఐపీలు తప్ప... ఇతరులెవరికీ అనుమతులివ్వడం లేదని సమాచారం. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అనుమతిస్తున్నట్లు తెలిసింది.

First published:

Tags: Delhi liquor Scam, Hyderabad

ఉత్తమ కథలు