ED notices to Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొత్తం 11మందిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ తర్వాత ఇటీవల డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిని ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో కేసీఆర్ తనయ, టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 9న విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారని సమాచారం. అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కవిత ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ధర్నా ముందు రోజే అంటే రేపే ఢిల్లీలో ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని ఈడీ కవితకు ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు కవిత. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు,ఢిల్లీ లిక్కర్ స్కామ్ఈ కేసులో కీలక వ్యక్తి అయిన రామచంద్ర పిళ్లైని నిన్న అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ..విచారణలో ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ బుచ్చిబాబుకు బిగ్ రిలీఫ్..ఎట్టకేలకు బెయిల్!
అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో.. ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. 17 పేజీల రిమాండ్ రిపోర్డులో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే అరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని ఈడీ కోర్టుకు నివేదించింది. "సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్‌రెడ్డితో పాటు.. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ధి చేకూర్చడం కోసం ఆరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారు. అప్ నేతలు, సౌత్ గ్రూప్ వ్యక్తులకు మధ్య పిళ్లై సయోధ్య కుదిర్చారు. ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు పిళ్లై దర్యాప్తులో అంగీకరించారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించారు" అని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.