( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా )
అసలే పండిన వడ్లు కొనే దిక్కులేదు. మిర్చి పైరు మధ్యలోనే తెగుళ్లతో మాడిపోయింది. పత్తి అంతంత మాత్రంగానే ఉంది. ఇలా ఇప్పటికీ రోడ్లపైనో.. కళ్లాల్లోనో ఆరబోసి.. అప్పడప్పుడూ వచ్చే అకాల వర్షాలకు తడుస్తున్న దుస్థితి. ఇలా కన్నీళ్లు కుక్కుకుంటున్న రైతన్నకు ఈ ఏడాది ఇప్పటిదాకా. పట్టుమని పదివేలు కూడా చేతికి రాని దైన్యం. కానీ ఈ దుస్థితి ఎవరికి పట్టింది..? అన్నట్టు.. సహకారశాఖ అధికారులు అన్నదాతపై జులుం సాగిస్తున్నారు. రుణ బకాయిలు చెల్లించలేదన్న సాకు చూపి ఇళ్లలోని సామాన్లు బయట గిరాటేసి మరీ ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. దానిపైన సీల్ వేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి ఇంట్లోకి ప్రవేశిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని.. జైలుకు పోవాల్సి ఉంటుందని భయపెడుతున్నారు.
ఒక రైతు చెల్లించాల్సింది కేవలం ఎనిమిది వేలు. ఆ మొత్తమే చాలా పెద్ద అమౌంట్ అన్నట్టు బకాయి కారణం చూపిన డీసీసీబీ అధికారులు ఆ రైతన్న పొలం వెళ్లిన సమయం చూసి మరీ ఇంటికి తాళం వేశారు. పైగా తాళం పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ హె చ్చరిస్తూ నోటీసు అంటించారు. ఇది ఖమ్మం జిల్లాలో రైతన్నలపై సాగుతున్న అరాచకం. బకాయిలు ఉన్న రైతులు ఇంట్లో లేకపోయినా, పనుల మీద పొలం వెళ్లినా లెక్కచేయకుండా కనీసం వారికి పరిస్థితి వివరించకుండానే తాళాలు పగులగొట్టి మరీ ఇళ్లలోని సామాన్లు విసిరేస్తున్నారు. పనికొచ్చే సామాన్లు వాహనాల్లోకి ఎక్కించి ఇళ్లకు తాళం వేసి మరీ వెళ్లిపోతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో గత కొద్ది రోజులుగా ఈ ఝుళుం సాగుతోంది. అసలే పంటలు లేక, పండిన కాస్త వరికి గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి కష్ట సమయాల్లో ఇదేం దారుణం అంటూ అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.
Hyderabad : పెళ్లి కావడం లేదని పురోహితుడి వద్దకు వెళితే.. తానే పెళ్లి చేసుకుంటానని..
అసలేం జరుగుతోంది.. ఖమ్మం డీసీసీబీలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని మొత్తం 48 మండలాలున్నాయి. మొత్తం 100 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుండగా, వ్యవసాయేతర సంఘాలు 176 ఉన్నాయి. వీటికి 50 శాఖా కార్యాలయాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. అయితే వీటికి గానూ బకాయిలు పంట రుణాల రూపంలో ఇచ్చినవి రూ.450 కోట్లు కాగా, వ్యాపార, మార్టిగేజ్ రుణాలు రూ.150 కోట్లు, జేఎల్‌జీ గ్రూపుల రుణాలు రూ.16 కోట్లు ఉన్నాయి. ఏటా మూడు వేల కోట్ల లావాదేవీలు జరిగే ఈ బ్యాంకు పరిధిలోని రూ.600 కోట్ల మొండి బకాయిలను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు బ్యాంకు అధికారులు. రుణాలు పొంది చెల్లించనివారిని ఉపేక్షించమని ఎవరూ చెప్పరు.
కానీ. సమయం సందర్భం చూసుకోవాలన్నదే ఇక్కడ వాదన. బకాయిదారునిగా ముద్ర పడాలి అని ఏ రైతన్న కోరుకోడు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క పంట కూడా సరిగా చేతికి రాలేదు. పైసలు అసలే రాలేదు. ఒకవైపు మిర్చి, పత్తి పంటకు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నప్పటికీ పంట లేదు. దీంతో రైతుల చెంతకు సొమ్ము చేరలేదు. సరిగ్గా ఈ కష్టకాలంలోనే సహకార శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు సైతం ఇచ్చారు. అన్నీ చట్ట ప్రకారమే చేసినా, రైతుల దగ్గర ఉన్నపుడు చేస్తే వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. లేని సమయంలో ఎంత వత్తిడి చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది అన్నది ఇక్కడి ప్రశ్న.
Schools Reopen : ఫిబ్రవరి 5 నుండి విద్యావ్యవస్థలు రీ ఓపెన్.. వైద్యశాఖ నివేదిక.. రేపు మంత్రి సమీక్ష
మరో వైపు ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో కాస్తకూస్త బకాయిలు చెల్లించే స్తోమత ఉన్నవాళ్లు సైతం ఆగిపోయారు. ఇది బకాయిల మొత్తాన్ని ఎక్కువగా కనిపింపజేస్తున్న పరిస్థితి. ఇలా రావాల్సిన బకాయిల్లో 2015-16 నాటివి కూడా ఉండడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎలా వసూలు చేయాలో తెలీక చివరకు ఇలా సహకార చట్టాన్ని పోలీసుల సహకారంతో అమలు చేస్తున్నారు. కానీ ఇది కూడా ఫలితం లేని ప్రయత్నంగానే మిగులుతోంది. ఎవరి వాదన వారికి కరెక్టుగానే ఉన్నప్పటికీ కేవలం రెండు నెలల వ్యవధిలో రూ.600 కోట్ల మేర రుణాల తాలూకూ బకాయిలను వసూలు చేయాలని పూనుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నంగా పేర్కొంటున్నారు. సర్వత్రా విమర్శలకు దారితీసిన ఖమ్మం డీసీసీబీ అధికారుల నిర్ణయం, వైఖరిని రైతన్నల కష్టాలు, కన్నీళ్లు మార్చలేకపో్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.