Dalitha Bandhu: నేడే దళితుల ఖాతాల్లోకి రూ.10 లక్షలు.. వాసాలమర్రిలో పండగ వాతావరణం

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్

Telangana Dalitha Badhu Scheme: దళిత బంధు కింద వచ్చే రూ.10 లక్షల్లో ప్రతి లబ్ధిదారుడి నుంచి ప్రభుత్వం రూ.10 వేలు తీసుకుంటుంది. దానికి మరో రూ.10 వేలను అదనంగా జమచేసి దళిత రక్షణ నిధి పేరుతో నిల్వ చేస్తుంది. ఈ నిధిని దళితుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖర్చు చేస్తారు.

 • Share this:
  సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో పండగ వాతావరణం నెలకొంది. ఇవాళే దళితులందరి ఖాతాల్లో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున డబ్బులు జమకానున్నాయి. వాసాలమర్రిలో ఉన్న మొత్తం 76 కుటుంబాలకు దళిత బంధు డబ్బులను అందిస్తున్నారు. అందుకోసం రూ.7.6 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దళిత వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఈ డబ్బును దళితులు తమకు నచ్చిన విధంగా ఖర్చుపెట్టవచ్చని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐతే వృథా ఖర్చులు చేయకూడదని.. ఆర్థికంగా బాగుపడేందుకే వినియోగించాలని ఆయన సూచించారు. దళిత బంధు పథకంతో దళితులంతా పేదరికం నుంచి బయటపడాలని అన్నారు.

  దళిత సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన దళిత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తారు. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందిస్తారు. మధ్యవర్తులతో ప్రేమయం లేకుండా.. రైతుబంధు ప‌థ‌కం మాదిరిగానే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జ‌మ చేస్తారు. మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. ఆగస్టు 16న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఐతే అంతకంటే ముందే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రారంభించారు. అనంతరం హుజూరాబాద్‌లో లాంచనగా ప్రారంభిస్తారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు రూ.3వేల కోట్లను ఖర్చు చేయనున్నారు.

  దళిత బంధు కించే ఇస్తున్న రూ. 10 లక్షలు.. లోన్ కాదు. ఆర్థిక సాయం. పూర్తిగా ఉచితం. మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. పథకం లబ్ధిదారులకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలేవీ ఆగిపోవు. వారి రేషన్‌కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతరత్రా సౌకర్యాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ డబ్బులతో లబ్ధి దారులు తమకు నచ్చిన పని చేసుకోవచ్చు. వ్యాపారమైనా పెట్టుకోవచ్చు. లేదంటే భూమైనా కొనుగోవచ్చు. కుటుంబానికి ఆదాయం అందించే ట్రాక్టర్, ఇతర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. కోళ్ల ఫారమ్, డైరీ ఫామ్ నిర్వహించుకోవచ్చు. దళితబంధు ద్వారా డబ్బు పొందిన లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. అందులో ప్రత్యేక చిప్‌ను అమర్చి ఈ డబ్బులు మంచి కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారా అనేది పర్యవేక్షిస్తారు. ఈ కార్డు ఆన్లైన్ అనుసంధానం చేసి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

  దళిత బంధు కింద వచ్చే రూ.10 లక్షల్లో ప్రతి లబ్ధిదారుడి నుంచి ప్రభుత్వం రూ.10 వేలు తీసుకుంటుంది. దానికి మరో రూ.10 వేలను అదనంగా జమచేసి దళిత రక్షణ నిధి పేరుతో నిల్వ చేస్తుంది. ఈ నిధిని దళితుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖర్చు చేస్తారు. గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితులను ఏర్పాటు చేసి ఈ నిధిపై పర్యవేక్షణ చేస్తారు. కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని సీఎం కేసీఆర్ ఇది వరకే చెప్పారు. ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దశల వారీగా రాష్ట్రమంతటా ఈ పథకం అమలవుతుంది.

  ఇవి కూడా చదవండి:

  Asara Pension: తెలంగాణలో ఆసరా పింఛన్ పొందాలనుకుంటున్నారా ? నిబంధనలు ఇవే.. పూర్తి వివరాలు.

  Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..
  Published by:Shiva Kumar Addula
  First published: