Dalita Bandhu : ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. మార్చి 7 లోగా ప్రతి నియోజకవర్గానికి వందమంది లబ్ధిదారుల ఎంపిక చేసి, అమలు పరచాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
ురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 118 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. కాగా ప్రతి నియోజకవర్గంలో వందమందికి ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాల్లో దళిత బందు అమలుకు అవసరమైన కమిటీలు ఎర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని త్వరగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఫిబ్రవరి 5లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మార్చి ఏడు వరకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అన్నారు.
దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లాధికారులతో దళిత బంధు పథకం పై ఆయన సీఎస్ తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధని, దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకమని అన్నారు. రాష్ట్రంలోని హుజరాబాద్ నియోజకవర్గం , వాసాలమర్రి గ్రామం మరియు మరో 4 మండలాలలో పూర్తిస్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. దళిత బంధుతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని, నిరుపేద దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
జిల్లాలలోని కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులను ఫిబ్రవరి 5 లోపు ఎంపిక చేయాలని సీఎస్ ఆదేశించారు .లబ్ధిదారులను గుర్తించే క్రమంలో ప్రతి నియోజక వర్గంలో అర్హులను సంబంధిత శాసన సభ్యుల ఆమోదంతో జిల్లా కలెక్టర్, అధికారుల పరిశీలన అనంతరం ఆ జిల్లా కు చెందిన మంత్రి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు రెండు రోజుల్లో ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.