CYBER GANGS CREATING NEW METHOD TO FRAUD CONSUMER VRY KMM
Cyber crime : ఆన్లైన్ వినియోగదారులు తస్మత్ జాగ్రత్త.. సరికొత్త ట్రెండ్‌కు సైబర్ ముఠా.. గిప్టులంటూ ఏకంగా ఇంటికి లేఖలు..
cyber crime
Cyber crime : సైబర్ క్రైం ముఠా సరికొత్త మోసాలకు తెర తీశారు.. ఇన్నాళ్లు ఆన్లైన్ కార్యకలాపాలతో ప్రజలను మోసం చేస్తున్న వారు.. తాజాగా మరో రకమైన కొత్త ఎత్తుగడతో మోసానికి పాల్పడుతున్నారు.
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
ఆన్లైన్ వినియోగదారులనే పావులుగా చేసుకుంటున్నసైబర్ ముఠా సభ్యులు గిఫ్టులు, వ్యాపారంతో వారిని బురిడి కొట్టిస్తున్న విషయం తెలిసిందే. మీ గిఫ్టు ఇదిగో వచ్చింది. అదిగో వచ్చింది, అంటూ డబ్బులు గుంజడం మాములుగా మారిపోయింది. అయితే ఇలాంటీ కేసులపై పోలీసులు అప్రమత్తం అవుతుండడంతో సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. దీంతో సైబర్ ముఠా కూడా పోలీసుల కళ్లు గప్పడంతో పాటు నేరుగా వినియోగాదారుల సమాచారం తెలుసుకుని వారితో నేరుగా టచ్‌లోకి వస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలా పాల్వంచ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ చేసిన ఓ వ్యక్తిని టార్గెట్ చేశాడు.. వినియోగదారుడి అడ్రస్‌తో కొద్ది రోజులకు అతనికి ఓ లెటర్ వచ్చింది. మీరు మా కంపెనీ ద్వారా షాపింగ్ చేశారు. మా కంపెనీ యాన్యువల్ డే సందర్భంగా తీసిన డ్రాలో మీరు కారు గెలుపొందారు. దాని విలువ ఎనిమిది లక్షలు. కోల్‌కతా వచ్చి మీరు కారును తీసుకెళ్లండన్నది లేఖలో పేర్కొన్నారు.. దీంతో ఆనందానికి, లోనైన ఆ వ్యక్తి, తాను వస్తువులను కొనుగోలు చేసిన కంపెనీ, లేఖ పంపించిన కంపెనీ ఒక్కటే కావడంతో కారు గెలిచినట్టు పూర్తిగా నమ్మాడు.
అయితే లేఖ అందిన తెల్లవారి నుంచి సైబర్ నేరగాళ్లు అసలు మోసానికి తెరలేపారు... ఇక కారు డెలివరీ చేయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉందని, రూ.15 వేలు పంపిస్తే అవి పూర్తి చేస్తామని.. మీరు కారు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని తీసుకెళ్లిపోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు బాగానే.. ఉన్నా.. ఇలా రోజుకు నాలుగైదు సార్లు, ఫోన్లు వస్తుండడంతో అతనికి సందేహం వచ్చింది. అప్పుడు అనుమానం వ్యక్తం చేసిన వినియోగదారుడు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు లెటర్‌పై ఉన్న హెల్ప్‌లైన్ నెంబర్లుకు ఫోన్ చేయగా ఒక్క నెంబరు కూడా పనిచేయడం లేదని తేలింది. లెటర్‌తో పాటుగా పంపిన స్క్రాచ్ కార్డులో ఉన్న బార్కోడ్ సైతం భోగస్ అని తెలిసింది. దీంతో పోలీసులు ఆన్లైన్ యాప్ వెబ్సైట్లో పరిశీలించి అక్కడి కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేయగా, తమ కంపెనీలో ఎలాంటి ఆఫర్లు లేవని, లక్కీడ్రాలు కూడా ఏమీ లేవని తేల్చారు. దీంతో ఆ వినియోగదారుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ వారు చెప్పినట్టు డబ్బులు పంపి ఉంటే... డబ్బులు మోసపోయోవాడినని వాపోయాడు.
ముఖ్యంగా సైబర్ ముఠా.. ఆన్లైన్ షాపింగ్ సైట్లను హ్యాక్ చేయడం ద్వారా వస్తువువు కొనుగోలుచేసిన వారి జాబితా, కాంటాక్ట్ వివరాలు సంపాదిస్తున్నారు. మొత్తం వివరాలను పేర్కొంటూ ఆఫర్లో ప్రైజ్ గెలిచారనో.. లేక లక్కీడ్రాలో కారు, ఇంకా విలువైన ప్రైజ్‌లు గెలిచారనో చెబుతున్నారు. ఆమేరకు అందగా ముద్రించిన బుక్‌లెట్‌ను దానిపై స్క్రాచ్‌కార్డు, బార్కోడ్ ఇస్తుండడంతో వినియోగదారులు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు.
ఇక వినియోగదారులు బలహీనతలను కూడా వీరికి తోడు అవుతున్నాయి. లక్షల విలువైన వస్తువులు గెలుపొందాక, అడుగుతుంది ఫార్మాలిటీస్ మాత్రమే కదా..? అదీ కేవలం వేలల్లోనే కదా అనుకుంటున్న పరిస్థితి. దీనికితోడు వెహికిల్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇంకా యాక్సెసరీస్ మీరే భరించాలన్న షరతు మరింత నమ్మకాన్ని పెంపొందిస్తోంది. దీంతో కాస్త ఆశకు గురైన కస్టమర్లు డబ్బు పంపి మోసపోతున్నారు. దీనికితోడు ఈ-కామర్స్ సంస్థలు సైతం తమ కస్టమర్లు చేసిన షాపింగ్ వివరాలు హ్యాక్ కాకుండా, ఇంకా మరేదైనా మార్గంలో మోసగాళ్లకు పొక్కకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇలాంటివి దృష్టికి వచ్చినపుడు ఆన్లైన్ మోసాలను అరికట్టే సైబర్ క్రైం సెల్ 155260 కు లేదా 100 ఫోన్ చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. అసలు అత్యాశకు గురికాకుండా ఉంటే ఇంకా మేలంటున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.