news18-telugu
Updated: October 19, 2020, 4:46 PM IST
పురానాపూల్ వంతెన
హైదరాబాద్ లో కురుస్తున్న భారీవర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఇప్పటికే మూసీ నదిని ఆనుకున్న ఉన్న కాలనీలు, నాలాల సమీపంలో ఇళ్లు మునిగిపోయాయి. చాదర్ ఘాట్, అంబర్ పేట్ బ్రిడ్జీలు సైతం మునిగిపోయాయి. అయితే మూసీ నదిపై 400 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రాత్మక వంతెన పురానాపూల్ సైతం మూసీ వరదకు కుంగిపోతోందని, ప్రస్తుతం ఈ వంతెన ప్రమాద దశకు చేరుకుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. భారీ వర్షాల దెబ్బతో మూసీ నదికి గడిచిన వందేళ్లలో ఎప్పుడు లేనంత స్థాయిలో వందేళ్లలో తొలిసారి ఎన్నడూ లేనంత వరద పోటెత్తడంతో 400 ఏళ్ల కిత్రం నాటి పురానాపూల్ వంతెన సైతం దెబ్బతిన్నది. భారీ ప్రవాహం ధాటికి బ్రిడ్జ్ పిల్లర్‌పై పగుళ్లు ఏర్పడంటంతో కొంతమేర కుంగింది. దీంతో సమచారం అందుకున్న అధికారులు పురానాపూల్ వంతెనపై నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత రాకపోకలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
చార్మినార్ నిర్మాణంతో పాటే పురానా పూల్ నిర్మాణం కూడా జరిగిందని చరిత్ర కారులు అంచనా ఉంది. ఈ వంతెనను ప్రేమకు చిహ్నంగా పేర్కొంటారు. గోల్కొండ యువ రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రియురాలు భాగమతిని ప్రేమిస్తాడు. వారి ప్రేమను నవాబు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అంగీకరించలేదు. దీంతో మూసీకి ఆవల ఉన్నటువంటి భాగమతిని కలిసేందుకు, అర్ధరాత్రి యువరాజు మహ్మద్ కులీకుతుబ్ షా వరద ఉధృతిలో ప్రవహిస్తున్న మూసీని దాటేందుకు ప్రయత్నించాడు. ప్రాణాలకు తెగించి మరీ మూసీని దాటి తన ప్రియురాలిని కలిశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఇబ్రహీం కులీ కుతుబ్ షా,యువరాజు ప్రేమకు కరిగిపోయాడు. వెంటనే వారికి వివాహం జరిపించడంతో పాటు తన కుమారుడి ప్రేమకు చిహ్నంగా .1578లో పురానా పూల్ వంతెన నిర్మించాడు. హైదరాబాద్ నగరంలో మూసీ నదిపై నిర్మించిన తొలి వంతెన ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటికీ ఈ కట్టడం నగరవాసులకు సేవలందిస్తుండటం విశేషం. మూసీ వరదలకు 1820 లో ఈ వంతెన కొద్దిగా దెబ్బతిన్నది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత 1908 లో మూసీ వరదల తర్వాత కొద్దిబాగాన్ని మరమ్మతు చేశారు. మరోసారి వందేళ్ల తరువాత భారీ వరదలు సంభవించడం వంతెన పటుత్వాన్ని పరిశీలిస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
October 19, 2020, 4:46 PM IST