తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Telangana Governor Tamilisai Soundara Rajan) తన పరిధిలో ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (CPI Secretary Koonam Neni Sambasiva Rao) సూచించారు. సెప్టెంబర్ 17 విలీనమో, విమోచనమో ఈ సంగతి గవర్నర్‌కు ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ తన పని తాను చూసుకుంటే మంచిదని హితవు పలికారు. శనివారం హైదరాబాద్ లోని మగ్దుం భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన గవర్నర్ ఎంతలో వుండాలో, అంతలోనే వుండాలన్నారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని, గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికి రాదన్నారు.సెప్టెంబర్ (September) 17ను విలీన దినోత్సవంగా డిక్లేర్ చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.
సమైక్యతా దినం అంటే అర్థం లేదని ..
తెలంగాణ సాయుధ పోరాటంలో భాజపాకు సంబంధమే లేదని కూనంనేని సాంబశివరావు కొట్టి పారేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విలీనంగా ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సమైక్యతా దినం అంటే అర్థం లేదని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. చరిత్రను చరిత్రగా తీసుకురాకపోతే సమాజానికి, దేశానికి ద్రోహం చేసిన వాళ్లవుతారని ఆయన తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన వాళ్లకు బీజేపీ అధికారంలోకి వచ్చాక పింఛన్ ఎందుకివ్వలేదని కూనంనేని ప్రశ్నించారు. రేపటి నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న మగ్ధుమ్ మోహినుద్దీన్ విగ్రహం నుంచి వారోత్సవాలు ప్రారంభించనున్నట్లు కూనంనేని తెలిపారు. ప్రజాస్వామ్యానికి గవర్నర్ వ్యవస్థ అంత మంచిది కాదని సీపీఐ కార్య దర్శి అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను తమిళి సై దుర్వినియోగం చేస్తున్నారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఈ నెల17న ఎగ్జిబిషన్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాల్లో తెలంగాణ సాయుధ పోరాటం అమరవీరులను స్మరిస్తూ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
అంతకుముందు మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా గవర్నర్‌పై విమర్శలు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మోదీ చెప్పినట్టు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై గవర్నర్ నేరుగా ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాననే విషయాన్ని తమిళిసై మరిచిపోతున్నారని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై ఘజినీ మహ్మద్ కన్నా దుర్మార్గంగా దాడులు చేస్తున్నదని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎలా పెడతారని, గవర్నర్ అధికారిక పర్యటనలు ప్రభుత్వం, అధికారుల కన్నా ముందుగా బీజేపీ వాళ్లకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CPI, Governor Tamilisai