కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ విరుచుకుపడుతోంది. కరోనా కొత్త వేరియంట్ Omicron భారత్‌లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భయపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్(RTPCR) పరీక్షలు సైతం నిర్వహించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే తాజాగా కార్ణటక(Karnataka)లో ఇప్పటికే ఒమిక్రాన్(Omicron) కేసులు నమోదయ్యాయి. వారికి పూర్తి చికిత్సను అందిస్తున్నారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలా సూచించే వైద్యలను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా సూర్యాపేటలో డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవడం అలజడి రేపుతోంది. డీఎంహెచ్‌వో కుమారుడు కొద్దిరోజుల కిందటే జర్మనీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జర్మనీలో రోజుకు 70 వేల కరోనా కేసులకు పైగా నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఈ వార్త తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆ వైద్యాధికారి ఇటీవల ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో డీఎంహెచ్ఓ కోటాలచం పలువురికి ప్రోత్సాహకాలను అందించాడు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అంతే కాకుండా.. కొడుకు విదేశాల నుంచి తిరిగి వచ్చాడనే సంతోషంలో రెండు రోజుల కిందట కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చినట్లు సమాచారం. తిరుపతి వెళ్లొచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన పరీక్షలో డీఎంహెచ్‌వోకి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం. డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్‌గా తేలింది.
ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ కూడా విధించారు. ఈ క్రమంలో ఆదేశం నుంచి వచ్చిన డీఎంహెచ్ఓ కుమారుడి విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేటలో ఈ విషయం కలకలం రేపుతోంది. వైరస్ ను మళ్లీ విదేశాల నుంచి మోసుకొచ్చారా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వీరిలో ఎవరికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు లేకపోయినప్పటికీ జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తికి సంబంధించిన శాంపిల్ సేకరించి జీనోం టెస్ట్‌కు పంపిస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని.. ప్రతీ ఒక్కరూ మస్క్ లు ధరించాలని.. లేకుంటే రూ.1000 ఫైన్ విధిస్తామన్నారు. దీంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.