Khammam: ఉమ్మడి ఖమ్మంపై కరోనా పంజా.. సరిహద్దులే కారణం.. పల్లెల్లో అధికంగా మహమ్మారి వ్యాప్తి

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రమంతటా కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రత కొనసాగుతోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

  • Share this:
    రాష్ట్రమంతటా కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రత కొనసాగుతోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిత్యం ఖమ్మం జిల్లాలో 7 వేల నుంచి 8 వేల మందికి పరీక్షలు చేస్తుండగా.. 300-400 మందికి, భద్రాద్రి జిల్లాలో 3 వేలపైగా టెస్టులు నిర్వహిస్తుండగా 100 నుంచి 200 మందికి పాజిటివ్‌గా తేలుతోంది. గడచిన ఒక్క రోజులోనే ఖమ్మం జిల్లాలో 7,549 టెస్టులకు 400 మందికి, భద్రాద్రి జిల్లాలో 7,242 టెస్టులకు 82 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గ్రామాల్లోనే కేసులు అధికంగా ఉంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

    ఖమ్మం జిల్లా  నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌, చింతకాని, రఘునాథపాలెం, కామేపల్లి, కారేపల్లి, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకల్‌, వైరా మండలాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వారావుపేట, ఏన్కూరు, దమ్మపేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సెకండ్‌ వేవ్‌ నుంచి ఖమ్మం జిల్లాలో 5 లక్షల పరీక్షలు నిర్వహించగా 50 వేలపైగా, కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల టెస్టులకు గాను 25 వేల కేసులు వచ్చాయి. రెండు జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల్లోనే 500 మందికి మించి చనిపోయారు. మరోవైపు 30 పైగా కేసులు రావడంతో నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పది రోజుల లాక్‌డౌన్‌ విధించారు.

    మద్యం కొనుగోలు, వైద్యానికి రాకపోకలతో..
    లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఏపీ సరిహద్దు మండలాల ప్రజలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు నిత్యవసర వస్తువులు, వైద్య చికిత్సలు, ఇతర పనులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పట్టణాలకు వస్తున్నారు. ఏపీ నుంచి కొందరు మద్యం కొనుగోలుకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల్లో బెల్టు షాపులు భారీగా పెరిగాయి. శుభ, అశుభ కార్యాల్లో భారీగా పాల్గొంటున్న ప్రజలు  కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశం కలుగుతోంది. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లోనూ సరైన చర్యలు తీసుకోవడం లేదు. మద్యం దుకాణాల వద్ద గుంపులుగా చేరుతుండడం కూడా పరిస్థితి తీవ్రం కావడానికి కారణమవుతోంది..

    రోజురోజుకూ కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఆదివారం నాడు ప్రత్యేక హెలికాప్టర్ లో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తగిన చర్యలకు ఆదేశించారు.

    (జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు)
    Published by:Sumanth Kanukula
    First published: