తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల ప్రశాంతంగానే ఈ ప్రక్రియ సాగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ అధికారులు పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలోని పలు కేంద్రాల్లో మాత్రం ఓటు వేసేందుకు వచ్చిన వారికి కచ్చితంగా కరోనా టెస్టులు చేపడుతున్నారు వైద్య అధికారులు. శేరిలింగంపల్లి, మదీనగూడ, హఫీజ్పేట్ పరిధిలోని పలు కేంద్రాల్లో ఈ రకమైన పరీక్షలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన సిబ్బందికి కచ్చితంగా పరీక్షలు చేస్తామని.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు.
టెస్టు చేసిన తరువాతే ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నామమని అన్నారు. ఓటర్లకు నిర్వహించే ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి ఫలితాలు అరగంటలోపే వస్తాయని వెల్లడించారు. మొబైల్ నంబర్ ద్వారా వారికి సమాచారం ఇస్తున్నామని.. ఒకవేళ ర్యాపిడ్ టెస్టుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే.. వారికి ఆ తరువాత తగిన సూచనలు చేస్తామని అన్నారు. అయితే నగరంలోని అనేక చోట్ల పోలింగ్ జరుగుతుండగా.. కొన్ని చోట్ల మాత్రమే రకంగా కరోనా టెస్టులు నిర్వహించడం గమనార్హం.
మహబుబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది స్రీలు, 68 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరిలో 1,31,284 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా నారాయణపేట్ జిల్లాలో 13,899 మంది మాత్రమే ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 35,510 మంది ఓటర్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 33,924, వన పర్తి జిల్లాలో 21,158, జోగులాంబ-గద్వాల్లో 14,876, నారాయణ్పేట్లో 13,899, రంగారెడ్డి జిల్లాలో 1,44,416, వికారాబాద్లో 25,958, మేడ్చల్-మల్కాజిగిరిలో 1,31,284, హైదరాబాద్ జిల్లాలో 1,10,243 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 799 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలో 56, నాగర్కర్నూల్ జిల్లాలో 44, వనపర్తి జిల్లాలో 31 , జోగులాంబ-గద్వాల్లో 22, నారాయణ్పేట్లో 20, రంగారెడ్డి జిల్లాలో 199, వికారాబాద్లో 38, మేడ్చల్-మల్కాజిగిరిలో 198, హైదరాబాద్ జిల్లాలో 191 ఉన్నాయి.ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 71 మంది ఉన్నారు. అక్కడ 505565 మంది ఓటర్లు ఉండగా 731 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి సాయంత్రం 4 గంటలకు ముగుస్తాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.