ఓ జంటకు ఆరేళ్ల క్రితం వివాహం జరగగా.. ఇటీవల కళ్యాణ లక్ష్మి మంజూరు అయింది. అయితే ఈలోగా అసలు కథ వెలుగుచూడటంతో.. ఆ చెక్కును వారికి అందజేయలేదు. తప్పుడు పత్రాలు సమర్పించి ఈ విధంగా చేసినట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల తోడ్పాటు కూడా ఉందని సమాచారం. ఈ ఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. చిన్నంబావి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు 2015లో వివాహమైంది. అయితే అప్పట్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి కళ్యాణ లక్ష్మి పథకం అమలులో లేదు. ఇక, 2018లో ఆ సామాజిక వర్గాన్ని కూడా కళ్యాణ లక్ష్మి జాబితాలో చేర్చారు.
అయితే అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. మహిళ 2021 ఫిబ్రవరిలో కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకన్నారు. తమకు 2018 నవంబర్‌లో వివాహం జరిగినట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించారు. దీంతో అధికారులు వారికి కల్యాణ లక్ష్మి మంజూరు చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం పెళ్లైన జంటకు.. 3, 4 వయసు ఉన్న పిల్లలు ఎలా ఉన్నారనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వీరికి 2015లోనే వివాహం జరిగినట్టుగా తేలింది.
స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటుతో సంబంధిత అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరించడంతో అక్రమార్కులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బయటికి తెలియడంతో ఆ మహిళకు మంజూరు అయిన కళ్యాణ లక్ష్మి చెక్కును వారికి అందజేయలేదు. తప్పుడు వివరాలతో కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Wanaparthi