Nirmal: లగ్గం ఆడా.. భోజనం ఇడా.. చాలా కొత్తగా ఉందంటున్న అతిథులు

వధూవరులు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. ఈ వేడుకను బంధువులు, స్నేహితుల మధ్య వేడుకగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ కరోనా వైరస్ జనాల జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది.

  • Share this:
    పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. ఈ వేడుకను బంధువులు, స్నేహితుల మధ్య వేడుకగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ కరోనా వైరస్ జనాల జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికి కరోనా పేరు చెబితేనే చాలా మంది వణికపోతున్నారు. అయితే కొందరు కరోనా కారణంగా శుభకార్యాలను నిబంధనల పాటిస్తూ జరుపుతుంటే.. మరికొందరు మాత్రం వాయిదా వేసుకుంటున్నారు. అయితే కరోనా పూర్తిగా తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో.. చాలా రోజులుగా వాయిదా వేస్తూ వచ్చిన వారు కూడా ఏదో రకంగా శుభకార్యాలను జరిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే శుభకార్యాల్లో గతంలో కనిపించిన సందడి మాత్రం ఇప్పుడు కొంతవరకు కరువైందనే చెప్పాలి. తాజాగా రెండేళ్లుగా వాయిదా పడిన ఓ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు చాలా తేలివిగా ప్లాన్ చేశారు. వధూవరులు ఇద్దరు అమెరికాలో ఉండటంతో అక్కడే పెళ్లి చేసుకునేలా చేశారు. మరో‌వై‌పు ఇక్కడ బంధువులను పిలిచి వారికి విందు ఏర్పాటు చేశారు.

    వివరాలు.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ప్రకాష్ రెడ్డి-జ్యోతిల కూతురుతో మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన నారాయణ్ రెడ్డి-లక్ష్మి కుమారుడితో వివాహం కుదిరింది. రెండేళ్ల క్రితమే వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే వారిద్దరు ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉండసాగారు. ఈలోగా కరోనా వైరస్ విజృంభణతో వారు స్వదేశానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.



    మరోవైపు నిశ్చితార్థం జరిగి కూడా చాలా రోజులు గడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే పెద్దలు వివాహ తేదీని ఖరారు చేశారు. అయితే మరోసారి పరిస్థితులు అనుకూలించకుండా పోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా పెళ్లి వాయిదా వేయకూడదని ఇరు కుటుంబాలు ఫిక్స్ అయ్యాయి. దీంతో అక్కడ ఉన్న స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వధూవరుల పెళ్లిని జరిపించారు. మరోవైపు చుట్టాలు, స్నేహితులను పిలిచి.. ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రోజెక్టర్ సాయంతో పెళ్లి వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఫంక్షన్ హాల్‌కు వచ్చిన అతిథులకు.. పెళ్లి అనంతరం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు పెళ్లికి సంబంధించి విశేషాలు.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో పెళ్లి చేసి.. ఇక్కడ భోజనాలు పెట్టిన ఆలోచన కొత్తగా ఉందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: