చికెన్, మటన్ వ్యాపారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ వార్నింగ్

లాక్‌డౌన్‌తో జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిన కారణంగానే మటన్ ధరలు పెరిగాయన్నారు తలసాని. ఇకపై ఆ పరిస్థితి ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

news18-telugu
Updated: March 30, 2020, 4:42 PM IST
చికెన్, మటన్ వ్యాపారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ వార్నింగ్
తలసాని శ్రీనివాస్ యాదవ్
  • Share this:
లాక్‌డౌన్‌లో మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు కిలో రూ.50 పలికి చికెన్ ఇప్పుడు 180 పలుకుతోంది. ఇక మటన్ కూడా కిలోకు రూ.800 చెల్లిస్తే గానీ దొరకడం లేదు. కరోనా పుకార్లతో మొన్నటి వరకు నష్టపోయామంటున్న వ్యాపారులు.. ఇప్పుడు లాక్‌డౌన్‌ను  క్యాష్ చేసుకుంటున్నారు. కొరతను కారణంగా చూపి.. అధిక ధరలకు మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మాంసం వ్యాపారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. అధిక ధరలకు మాంసం విక్రయించే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్‌, చేపల లభ్యతపై మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన..  మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  పశుసంవర్థక, మత్స్య, పోలీసు, రవాణా శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారిని నియమిస్తామని  చెప్పారు. లాక్‌డౌన్‌తో జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిన కారణంగానే మటన్ ధరలు పెరిగాయన్నారు తలసాని. ఇకపై ఆ పరిస్థితి ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్లు, గుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు.

గొర్రెలు, మేకల పెంపకం దారులు వాటిని విక్రయించుకునేందుకు వీలుగా అనుమతుల కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అలాగే మత్స్యకారులు కూడా  చేపలను రవాణా చేసి, విక్రయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  వాహనాల్లో ఏ వస్తువులను తరలిస్తారన్నది తెలిపేలా..  తప్పని సరిగా పోస్టర్లను అంటించాలని స్పష్టం చేశారు తలసాని.  ఈ సమీక్షా సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి  పాల్గొన్నారు.

First published: March 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading