CORONAVIRUS GENETIC MATERIAL FOUND IN HYDERABADS HUSSAIN SAGAR AND TWO OTHER LAKES SU
Hyderabad Hussain Sagar: షాకింగ్.. హుస్సేన్ సాగర్లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. మరో రెండు చెరువుల్లో కూడా.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
హుస్సేన్ సాగర్(ఫైల్ ఫొటో)
హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నవారికి ఇది ఆందోళన కలిగించే వార్త అనే చెప్పాలి. హైదరాబాద్ మధ్యలో ఉన్న హుస్సేస్ సాగర్లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని ఓ అధ్యయనంలో తేలింది.
కరోనా పేరు చెబితేనే వణికిపోతున్న జనాలకు.. తాజా అధ్యయనం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నవారికి ఇది ఆందోళన కలిగించే వార్త అనే చెప్పాలి. హైదరాబాద్ మధ్యలో ఉన్న హుస్సేస్ సాగర్లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని ఓ అధ్యయనంలో తేలింది. హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం తలాబ చెరువు(తుర్క చెరువు)లలో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని ఆ అధ్యయనం పేర్కొంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందని తెలిపింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(CSIR-IICT), సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ హైదరాబాద్(CSIR-CCMB, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్(AcSIR) ఘజియాబాద్లకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఏడు నెలల పాటు చెరువులలోని నీళ్లను పర్యవేక్షించారు. కరోనా మొదటి మరియు రెండో వేవ్ సమయంలో ఈ అధ్యయనం జరిగింది. చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. నీటి ద్వారా కరోనావైరస్ వ్యాపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతికంగానే కరోనావైరస్ వ్యాప్తి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి అధ్యయనాలు నిర్వహించారని.. నీటిలోని పదార్థం నుంచి వైరస్ వ్యాప్తికి ఎలాంటి ఆధారాలు లేవని తేలినట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.
ఇక, ఈ మూడు చెరువులే కాకుండా ఘట్కేసర్ సమీపంలోని ఎదులాబాద్ చెరువులో, పోతురాజ్ చెరువులలో నీటిని కూడా ఈ అధ్యయనంలో పరిశీలించారు. అయితే ఆ రెండు చెరువుల్లో వైరస్ జన్యు పదార్థాల ఆనవాళ్లు మాత్రం కనిపించలేని శాస్త్రవేత్తలు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.